
కరూర్ వెలుచామైపురం తొక్కిసలాట ఘటన ఇప్పటికే 39 మంది మరణించగా.. 95 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. అయితే 51 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనకు బాధ్యుడైన టీవీకే అధినేత విజయ్‌ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ అన్ని పార్టీల వైపు నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ దరిమిలా.. రాజకీయ పార్టీల బహిరంగ సభలపై ఈ మధ్యే తమిళనాడు ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకే లక్ష్యంగా.. తమిళగ వెట్రి కగళం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ తన ప్రచార సభలను సెప్టెంబర్ 13, 2025న తిరుచ్చిలో ప్రారంభించారు. అయితే తమ సభలకు, ర్యాలీలకు డీఎంకే ప్రభుత్వం అడ్డం పడుతోందని ఆరోపిస్తూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ పిటిషన్‌పై సెప్టెంబర్ 18వ తేదీన మద్రాస్ హైకోర్టులో వాదనలు జరిగాయి.
‘‘తిరుచ్చిలో మా పార్టీ ప్రచార సభ అనుమతి కోరుతూ సీపీ ఆనంద్‌కు మా పార్టీ జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్ రిక్వెస్ట్ చేశారు. అయితే అనుమతులు ఇచ్చినప్పటికీ.. 23 కఠిన నిబంధనలు విధించారు. గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు సభకు రాకూడదని చెబుతూ అందులో పేర్కొన్నారు. దీనిని అమలు చేయడం కష్టం. ఇది అన్యాయం. ఇతర పార్టీలకు సులభంగా ఇస్తున్న పోలీసులు.. టీవీకే విషయంలోనే పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు’’ అని టీవీకే వాదించింది.
దీంతో కోర్టు చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర హోం కార్యదర్శిని విచారణలో భాగంగా పిలిపించుకుంది. అయితే.. టీవీకే సభలకు అనుమతికి మించి జనాలు వస్తున్నారని, తిరుచ్చి ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రజల ఆస్తికి నష్టం కలిగించారంటూ పోలీసులు ఫొటో ఆధారాలను సమర్పించారు. దీంతో జస్టిస్ సతీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజల భద్రతకు, ప్రజా ఆస్తులకు పార్టీలే బాధ్యత వహించాలి, గర్భిణులు, వికలాంగులు, వృద్ధులు సభలకు రాకుండా నేతలే సూచించాలి. ఇక నుంచి తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభలు నిర్వహించాలంటే ఒక నిర్దిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. సభల సమయంలో ప్రజా/ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరిగితే, ఆ డిపాజిట్‌ను పరిహారంగా ఉపయోగించాలి. అలాగే.. పోలీసు యంత్రాగం కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఒకే విధమైన, చట్టబద్ధమైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. సభలకు అనుమతులు ఇవ్వడంలో వివక్ష ఉండకూడదు’’ అని ఇటు ప్రభుత్వానికి, అటు టీవీకేకు మొట్టికాయలు మద్రాస్ హైకోర్టు వేసింది. ఈ క్రమంలో టీవీకేకు స్వల్ప ఊరట ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..
కోర్టు సూచన మేరకు సెప్టెంబర్ 24వ తేదీనే తమిళనాడు ప్రభుత్వం పొలిటికల్ ర్యాలీల మార్గదర్శకాలను సమర్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ గడువు కోరడంతో తదుపరి విచారణ వాయిదా పడింది. మధ్రాస్ హైకోర్టు రాజకీయ పార్టీల సభలపై ఆందోళనలు వ్యక్తం చేసిన కొన్ని రోజులకే కరూర్ విషాదం చోటు చేసుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి: ప్రాణాలు పోతుంటే.. పారిపోయావా విజయ్?