
కరూర్ ఘటనపై తమిళగ వెట్రి కగళం(TVK) సంచలన ఆరోపణలకు దిగింది. ర్యాలీపై రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీఛార్జి చేయడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందని ఆరోపించింది. ఈ మేరకు కుట్ర కోణంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ మద్రాస్ హైకోర్టును ఆదివారం ఆశ్రయించింది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఉదయం తన నివాసంలో న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న టీవీకే విజ్ఞప్తికి జస్టిస్ దండపాణి అంగీకారం తెలిపారు. కోర్టుకు సెలవులు ఉన్నప్పటికీ.. రేపు(సోమవారం) మధురై బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఘటనపై ఇప్పటికే టీవీకే కేడర్‌పై(విజయ్ మినహా) కేసులు నమోదు అయ్యాయి. అలాగే తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు కూడా. అయితే.. కుట్ర కోణం ఉందన్న నేపథ్యంలో హైకోర్టే సుమోటోగా దర్యాప్తు చేపట్టాలని, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణకు ఆదేశించాలని పిటిషన్‌లో టీవీకే విజ్ఞప్తి చేసింది. అంతేకాదు.. కరెంట్ పోవడం, విజయ్‌పైకి గుర్తు తెలియని ఆగంతకులు చెప్పులు విసరడం, అదే సమయంలో తొక్కిసటాల జరగడం లాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
తమ సభలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది కూడా. అయితే.. టీవీకే ఆరోపణలను ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీ వెంకట్‌రామన్ ఖండించారు. అనుమతిచ్చిన దానికంటే జనం అత్యధికంగా వచ్చారని, విజయ్ ర్యాలీకి ఆలస్యంగా వచ్చారని, ఆ సమయంలో పోలీసులకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారని, ఇప్పుడేమో పోలీసులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఇదిలా ఉంటే.. కరూర్ ర్యాలీలో విజయ్ పది రూపాయల మంత్రి అంటూ పరోక్షంగా సెంథిల్ బాలాజీని ఉద్దేశించి పాట అందుకున్నారు. ఆపై జోష్‌తో అక్కడున్నవాళ్లంతా ఆయన దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాతే పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది.
ఇదిలా ఉంటే.. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు జరుపుతున్నారు. వారాంతాల్లో కీలక నియోజకవర్గాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కరూర్ జిల్లా వెలుచామైపురం వద్ద జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో మరొకరు మరణించడంతో ఆ సంఖ్య 40కి చేరింది. ర్యాలీకి చాలా ఆలస్యంగా విజయ్ రాగా.. అప్పటికే తిండి, నీరు లేక నీరసించి పోయిన జనం సొమ్మసిల్లిపోవడంతో అలజడి రేగింది. ఆపై ఆంబులెన్స్ వచ్చే క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు ఎంత అదుపు చేసే ప్రయత్నం చేసినా.. పరిస్థితి చేజారిపోయింది.
ఈ పరిణామంతో ర్యాలీ మధ్య నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు విజయ్. బాధితులను పరామర్శించుకుండా, మీడియాతో మాట్లాడకుండా విజయ్ వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో చెన్నైలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఒకవైపు విజయ్ మద్దతుదారులు.. మరోవైపు ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నిరసనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వచ్చేవారం పర్యటన రద్దు
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో వచ్చేవారం నిర్వహించాల్సిన టీవీకే ర్యాలీని విజయ్ రద్దు చేసుకున్నారు. కరూర్ బాధితులను పరామర్శించేందుకు అనుమతించాలంటూ ఆయన పోలీసులకు లేఖ రాశారు. దీనిపై బదులు రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: జనాలు చస్తుంటే విజయ్ పారిపోయాడు!