
సాక్షి, చెన్నై: కరూర్ ర్యాలీ దుర్ఘటనతో సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
గత శనివారం సాయంత్రం తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన మీట్ ద పీపుల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విజయ్‌పై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తొక్కిసలాట దుర్ఘటనలో టీవీకే పార్టీకి చెందిన పలువురు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విజయ్ సైతం కరూర్ బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్1)విజయ్ తన టీవీకే పార్టీ రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారాన్ని రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీవీకే తన అధికారిక ‘ఎక్స్’ ట్వీట్ చేసింది. ‘మా ప్రియమైన వారిని కోల్పోయినందుకు మేము బాధలో ఉన్నాం. ఈ పరిస్థితిలో రాబోయే రెండు వారాల పాటు టీవీకే బహిరంగ సభలను తాత్కాలికంగా వాయిదా వేస్తుంది’అని ట్వీట్‌లో పేర్కొంది. పార్టీ అధినేత విజయ్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పార్టీ భవిష్యత్ కార్యచరణకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తాం’అని తెలిపింది.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025