
తమిళనాడు: వివాహమైన 10 నెలలలోనే ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చెన్నై కోడంబాక్కంలో అద్దెకు గది తీసుకుని నివసిస్తున్న జ్యోతిశ్వరి ( 30). ఈమె ఎం.బి.బి.ఎస్, ఎం.ఎస్. చదివింది. ఆమె స్వస్థలం రామనాథపురం. ఈమె మీనంబాక్కంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తోంది. ఈమెకు రామనాథపురానికి చెందిన యోతీశ్వరన్ (34)తో గత సంవత్సరం నవంబర్‌లో వివాహం జరిగింది. ఇంజినీరైన యోతీశ్వరన్ దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో యోతీశ్వరన్ తన భార్యను విడిచిపెట్టి తన స్వస్థలానికి వెళ్లి ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ భార్యను చూడటానికి వచ్చి వెళ్లేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో పెరుంగళత్తూరు శ్రీరామ్ గేట్‌లో 12 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న తన సోదరి ముత్తులక్ష్మి ఇంటికి జ్యోతిశ్వరి వెళ్లింది.
ఆ తర్వాత సాయంత్రం తన ఇంటికి బయలుదేరింది. అపార్ట్‌మెంట్ ’లిఫ్ట్’లోకి వెళ్లిన జ్యోతిశ్వరి, కిందకు వెళ్లకుండా పైకి వెళ్లింది. టెరస్ర్‌కు వెళ్లి తన చెప్పులు, హ్యాండ్‌బ్యాగ్ తీసివేసి 12వ అంతస్తు నుంచి కిందకు దూకింది. ఇందులో, తలకు. తీవ్రంగా గాయపడిన జ్యోతిశ్వరి సంఘటన స్థలంలోనే దారుణంగా మృతి చెందింది . ఈ విషయం తెలుసుకున్న పీర్కన్‌కరణై పోలీసులు ఆత్మహత్య చేసుకున్న జ్యోతిశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భర్త అరాచకాలు భరించలేకనే..?
కాగా గత నవంబర్ నెలలో తల్లిదండ్రులు చూసిన వరుడు యోతీశ్వరన్‌ను మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే, యోతీశ్వరన్ తన భార్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా గంజాయితో పాటూ అనేక ఇతర చెడు అలవాట్లలో మునిగిపోయాడు. అంతేకాకుండా, డేటింగ్ యాప్ ద్వారా 30 మందికి పైగా మహిళలతో పరిచయం పెంచుకుని, పెళ్లయిన తర్వాత కూడా వారితో సంబంధాలు కొనసాగించాడు.
కాగా ఎంతో ఆశతో పెళ్లి చేసుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలుసుకున్న జ్యోతీశ్వరి, తన భర్త ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా, అతను అనేక మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసి మనోవేదకు గురైంది. ఈ నేపథ్యంలో, కోడంబాక్కంలోని తన తల్లితో కలిసి గది తీసుకుని ఉంటున్న జ్యోతీశ్వరి, పెరుంగళత్తూరులోని అక్క ఇంటికి వెళ్లినప్పుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.