సాక్షి, హైదరాబాద్: యూట్యూబర్ అన్వేష్‌పై నమోదు అయిన కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తును పంజాగుట్ట పోలీసులు వేగవంతం చేశారు. అతగాడు చేసిన అభ్యంతకర.. అనుచిత వ్యాఖ్యల తాలుకా వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అన్వేష్‌కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లపై ఆరాలు తీస్తున్నారు. (Prapancha Yatrikudu Anvesh Controversy)
నా అన్వేషణ చానెల్స్‌తో ప్రపంచ యాత్రికుడు, ఆటగాడిగా పాపులారిటీ సంపాదించుకున్న అన్వేష్.. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సినీనటి, బీజేపీ నేత అయిన కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతర కంటెంట్ ప్రచారం చేశారని పేర్కొనడంతో అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే..
ఈ కేసులో నోటీసులు ఇవ్వడానికి ముందు అతని అకౌంట్లకు వెరిఫై చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. తద్వారా వారిచ్చే వివరాలతో అతని అకౌంట్లను పరిశీలించనున్నారు. (Naa Anveshana Police Case News)
ఇప్పటికే అన్వేష్‌పై ఖమ్మంలోని ఖానాపురంహవేలి పీఎస్‌లో ఓ కేసు నమోదయ్యింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవిలపట్ల అసభ్యంగా వీడియో రిలీజ్ చేశాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
హీరోయిన్ల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో అన్వేష్ తన నోటికి పని చెప్పాడు. హిందూ దేవతల ప్రస్తావనతో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అన్వేష్‌ను దేశద్రోహిగా ప్రకటించాలని.. వెంటనే భారత్‌కు రప్పించి.. శిక్షించాలని కోరుతున్నాయి. అదే సమయంలో అతన్ని అన్‌ఫాలో కొడుతూ నెట్టింట మినీ ఉద్యమమే నడిపిస్తున్నారు.


