
సుప్రీంలో డీఎంకే సర్కార్‌కు ఊరట
పిటిషన్ వేసిన అన్నాడీఎంకే నేత షణ్ముగంకు రూ.10 లక్షల జరిమానా
అన్ని రాష్ట్రాల్లో సీఎంల పేర్లు, ఫొటోలు వాడుతున్నారన్న ధర్మాసనం
న్యూఢిల్లీ: తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నుంచి భారీ ఊరట లభించింది. మీకు అండగా స్టాలిన్( విత్ యూ స్టాలిన్) పేరిట తమిళనాట డీఎంకే సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకం పేరులో ముఖ్యమంత్రి(స్టాలిన్), ఇతర మంత్రుల పేర్లు ఉండటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
సంక్షేమ పథకంలో స్టాలిన్ పేరు ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వు వచ్చింది. దీంతో మద్రాస్ హైకోర్టు తీర్పును డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌చేయగా బుధవారం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్‌వీ అంజారియాల సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ షణ్ముగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
దురుద్దేశంతో పిటిషన్ వేశారని మండిపడుతూ షణ్ముగంపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ‘‘పిటిషనర్ షణ్ముగం అత్యుత్సాహాన్ని మేం ఏమాత్రం ప్రోత్సహించట్లేము. ఆయన కేవలం ఒకే ఒక్క రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని పిటిషన్ వేశారు. రాజకీయ పారీ్టలు ప్రభుత్వ నిధులను నాయకుల పేర్లతో వృథాగా ఖర్చుచేస్తున్నారన్న స్పృహ ఆయనకు నిజంగా ఉంటే ఆయన దేశంలో ఇలాంటి అన్ని రాజకీయ పారీ్టలు అమలు చేస్తున్న అన్నీ పథకాలను ఆయన సవాల్‌చేయాలి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇలా ముఖ్యమంత్రుల పేర్లను ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఉపయోగిస్తున్నారు.
రాజకీయ నాయకుల పేర్లతో పథకాలు ఉండొద్దనే న్యాయబద్ధమైన నిషేధాజ్ఞలు లేవు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ రాజకీయ యుద్ధాలను ఎన్నికల్లో తేల్చుకోవాలి. రాజకీయ యుద్ధాల కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దు’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ‘‘షణ్ముగం వేసిన పిటిషన్ న్యాయబద్ధంగా లేదు. చట్టప్రకారం లేదు. అందుకే ఆయనకు అనుకూలంగా గతంలో వచి్చన తీర్పును పక్కనబెడుతున్నాం. ఈమేరకు హైకోర్టు తీర్పును పక్కనబెట్టేందుకు ఉద్దేశించిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను అనుమతిస్తున్నాం’’ అని కోర్టు తెలిపింది.