
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ(జులై 31, 2025) కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం (OPS) ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన ఫొటో ఒకటి వైరల్ అయిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
ఈ ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మార్నింగ్ వాక్‌లో కనిపించిన ఓపీఎస్.. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే ఆయన వర్గం నుంచి కీలక ప్రకటన వెలువడింది. తమ వర్గం ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకుందని, ఇక ఆ కూటమితో కలిసి నడిచేది లేదని మాజీ మంత్రి, ఓపీఎస్ నమ్మిన బంటు పానుర్తి రామచంద్రన్ గురువారం మధ్యాహ్నాం ప్రకటించారు. ఆ సమయంలో ఓపీఎస్ పక్కనే ఉండడం గమనార్హం. అయితే..
భవిష్యత్తులో ఏ పార్టీతో కలిసి నడుస్తారనేదానిపై ఆయన వర్గం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ పొత్తు అనుకోవడం లేదు.ఎన్నికలు సమీపించే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని ప్రకటించారాయన.
అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్న పన్నీర్ సెల్వం.. ఎడప్పాడి కె పళని స్వామితో పొరపచ్చాలతో సొంత వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తమదే అసలైన అన్నాడీఎంకే వర్గంగా ప్రకటించుకున్న పళనిస్వామి.. ఓపీఎస్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో బహిష్కృత నేతగానే ఓపీఎస్ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన వర్గాన్ని సైతం బీజేపీ దగ్గరకు తీసుకుంది. అయితే.. ఈ మధ్య జరిగిన పరిణామాలతో నొచ్చుకున్న ఆయన ఎన్టీయేకు కటీఫ్ చెప్పారు.
కారణం అదే..
గంగైకొండ చోళపురం పర్యటనలో ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీకి ఓపీఎస్ ప్రయత్నించారు. అయితే కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదు. తనకు ఆ మాత్రం ప్రాధాన్యం లేదా? రగిలిపోయారాయన. ఆ వెంటనే.. సర్వ శిక్షా అభియాన్ నిధుల జాప్యంపై ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు కూడా. ఇలా వరుస పరిణామాల తర్వాతే ఆయన ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ఆయన మద్ధతు ఇస్తారంటూ గత రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈలోపే ఆయన డీఎంకే అధినేతతో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది ఇప్పుడు. విజయ్ పార్టీనా? స్టాలిన్ డీఎంకేనా? అనే ఛాయిస్‌ను బట్టి ఓపీఎస్‌ను అన్నాడీఎంకే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.
బలం పెంచుకునే యోచనలో ఓపీఎస్
ఓపీఎస్ వర్గంలో దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన బలమైన నేతలే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆ వర్గంలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వీళ్లలో వీసీ ఆరుకుట్టి ఇప్పటికే పళనిస్వామి వర్గం వైపుళ్లిపోయారు. ఓపీఎస్ కొడుకు రవీంద్రనాథ్ కూడా విజయ్ టీవీకేతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన మరికొందరిని ఆ పార్టీలోకి తీసుకెళ్తారని ఊహాగానాలు వినవస్తున్నాయి. అదే సమయంలో..
మాజీ సీఎం జయలలితకు సన్నిహితురాలైన శశికళతో పాటు టీటీవీ దినకరన్‌ను తన వర్గంలోకి చేర్చుకోవాలని ఓపీఎస్ ఉవ్విళ్లూరుతున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన మదురైలో మహానాడు నిర్వహించి తన బలం నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. సొంత పార్టీ ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.