న్యూఢిల్లీ: మదురైలోని థిరుప్పారాన్‌కుండ్రం కొండపై కార్తీకదీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌పై మతపర ఆరోపణలు చేసిన నిరసనకారులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ విషయంలో మీ స్పందన తెలపాలని డీఎంకే సర్కార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ రాష్ట్ర డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, తదితరులకూ జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీఎంకే ప్రభుత్వాన్ని కోరింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి రెండో తేదీకి వాయిదావేసింది. డీఎంకే మిత్రపక్షాలు, కార్యకర్తలు, లాయర్లు మద్రాస్ హైకోర్టు చెన్నై, మదురై ప్రాంగణాల్లో జడ్జికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉల్లంఘనలకు పాల్పడ్డారని న్యాయవాది జీఎస్ మణి ఈ పిటిషన్ వేశారు.


