
చెన్నై: తమిళనాడు సర్కార్‌కి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా గవర్నర్‌పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల కంటే గవర్నర్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.
విభేదాలు మరోసారి బహిర్గతం అవ్వడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. ఆదివారం ఆయన ధర్మపురిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గవర్నర్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
‘ప్రతిపక్షాలు చేసే విమర్శలపై తనకు ఆందోళన లేదన్న స్టాలిన్.. అవన్నీ రాజకీయాల్లో సహజమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్ రవి.. వారి కంటే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్‌లో ఉండి అధికార డీఎంకేకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై స్టాలిన్ మండిపడ్డారు. తమిళ గీతాన్ని కూడా అగౌరవ పరుస్తారంటూ గవర్నర్‌పై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళ భద్రత, విద్యారంగంపై గవర్నర్ ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడు దేశంలోనే అగ్ర రాష్ట్రమని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.
‘‘తమిళనాడు ప్రజల కోసం మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. కానీ కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు’’ అంటూ స్టాలిన్ మండిపడ్డారు.