
సాక్షి, చెన్నై: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇండియా కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. కూటమి తరఫున ఎవరిని బరిలో నిలపాలి అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన వ్యక్తినే ఎంపిక చేయాలని డీఎంకే సీనియర్ నాయకుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సదరు నేత అంతటితో ఆగకుండా.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌తో తమిళనాడుకు ప్రయోజనం లేదని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.
వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే అంశంపై విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు సోమవారం సమావేశమయ్యారు. కూటమి పార్లమెంటరీ పక్ష నేతలు.. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నాయకులు ఇళంగోవన్ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది భారత ఉప రాష్ట్రపతి పదవి. రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థి.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి. ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మా రాష్ట్రానికి ప్రత్యేకంగా జరిగే మంచి ఏమీ ఉండదు. దీన్ని భాష ద్వారా మాత్రమే కాకుండా రాజకీయంగా చూడాలి.
#WATCH | Chennai, Tamil Nadu: On Maharashtra Governor CP Radhakrishnan announced as NDA's Vice Presidential candidate, DMK Leader TKS Elangovan says, "He is an RSS man. He is a BJP candidate. You should view this politically, not as per language...I don't know why the poor man… pic.twitter.com/I1IxxxH2Ij
— ANI (@ANI) August 18, 2025
బీజేపీ నేతృత్వంలోని బీజేపీ.. ఇప్పటికే పలుమార్లు తమిళులను అవమానించింది. బీజేపీ.. తమిళుల కోసం పనిచేయలేదు. కేంద్రంలోని పెద్దలు.. తమిళనాడు విద్యార్థులకు ఎటువంటి సాయం అందించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే నుంచే అభ్యర్థి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అందుకే రాధాకృష్ణకు పోటీగా తమిళనాడు నుంచే.. అది కూడా డీఎంకే నుంచి అభ్యర్థి ఎంపిక చేయాలని కోరుతున్నాను అని అన్నారు. చివరగా.. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇండియా బ్లాక్ తీసుకున్న నిర్ణయానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ఇండియా కూటమిలో కొంత మంది నేతలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు దగ్గరలో ఉన్నందున అధికార పక్షం క్రాస్ ఓటింగ్ ద్వారా తమ బలాన్ని పెంచుకుంటే.. అది బీహార్ ఓటర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారు భావించారు.
కూటమి మల్లగుల్లాలు..
కాంగ్రెస్ వర్గాల సమాచారాల ప్రకారం.. విపక్ష అభ్యర్థి కాంగ్రెస్ నుంచే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. మిత్రపక్షాలు తటస్థ, స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న అభ్యర్థి పేరును సూచిస్తే, కాంగ్రెస్ కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, సిద్ధాంతపరమైన పోరాటాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అంటే బీజేపీకి స్వేచ్ఛగా మార్గం ఇవ్వడమేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ఈ నెల 19న సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చి మళ్లీ 21న బీహార్ వెళ్లనున్నారు. ఈ సమయంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది.