
ఢిల్లీ: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 4న పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలతో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తాజాగా విజయ్ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ వారంలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే.
రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. రాష్ట్రపతి సంతకంతో చట్టంగా రూపుదాల్చింది.