
జకార్తా: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ రిసార్ట్ ద్వీపం బాలి సమీపంలో 65 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. వెంటనే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 43 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం తూర్పు జావాలోని కేతాపాంగ్ ఓడరేవు నుంచి బయలుదేరిన తును ప్రతమ జయ అనే ఫెర్రీ 30 నిమిషాల తర్వాత నీటి మునిగింది. ఆ సమయంలో ఫెర్రీ.. బాలిలోని గిలిమనుక్ ఓడరేవుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. 14 ట్రక్కులు సహా 22 వాహనాలను ఫెర్రీలో రవాణా చేస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికితీశామని, 20 మందిని రక్షించామని, వారిలో చాలా మంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు బన్యువాంగి పోలీసు చీఫ్ రామ సమతామ పుత్ర తెలిపారు. టగ్‌బోట్లు, తొమ్మిది పడవలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఇండోనేషియాలో ఫెర్రీ ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. దేశంలో ఫెర్రీలు కీలక రవాణా సాధనాలుగా ఉపయుక్తమవుతుంటాయి. గత మే నెలలో బెంగ్కులు ప్రావిన్స్‌లో ఒక చెక్క పడవ మునిగిపోవడంతో ఏడుగురు పర్యాటకులు మృతిచెందారు. 34 మంది గాయపడ్డారు. అదే నెలలో 89 మందితో ప్రయాణిస్తున్న పర్యాటక పడవ బాలి తీరంలో నీట మునిగింది. అయితే ఈ ఘటనలో రెస్క్యూ సిబ్బంది ప్రయాణికులందరినీ రక్షించారు.
ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం