
వాషింగ్టన్: విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. విద్యార్ధులు,విజిటర్ల వీసాలపై నిర్ధిష్ట సమయాన్ని విధించనున్నారు. ఆ గడువు పూర్తయిన విద్యార్థులు, విజిటర్లు వారి వీసాల్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ కాకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో విదేశీయులపై ఆంక్షల కత్తి వేలాడుతున్నట్లైందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో అక్రమ వలస దారులు అరికట్టేలా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు, టూరిస్టులు దేశంలో ఉండే సమయాన్ని నిర్ధేశించనుంది. ఆ సమయం గడువు దాటిన తర్వాత దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త వీసా ప్రతిపాదనలు తెచ్చింది.
ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి, ప్రతి వీసాకు నిర్దిష్ట గడువు విధించాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం F-1 (విద్యార్థులు), J-1 (ఎక్స్చేంజ్ విజిటర్లు) వీసాలపై ఉన్నవారు తమ విద్యను కొనసాగిస్తున్నంత వరకు అమెరికాలో ఉండే హక్కు ఉంది. కొత్త ప్రతిపాదన అమలైతే, వారు పూర్తిగా గడువు ముగిసేలోపు దేశాన్ని విడిచి వెళ్లాలి లేదా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేయాలి.
త్వరలోనే అమలు
ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ సిద్ధం చేసి, ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (OMB) సమీక్షకు పంపింది. ప్రజల అభిప్రాయాల కోసం 30–60 రోజుల గడువు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆ తరువాత ఈ కొత్త వీసా రూల్స్ అమల్లోకి రానున్నాయి.
విదేశీ విద్యార్థులపై ట్రంప్ చర్యలు:
ట్రంప్ పాలనలో అక్రమ వలసదారుల తొలగింపు, యూనివర్సిటీలపై నియంత్రణ పెరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీపై 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండింగ్‌ను నిలిపివేశారు. ట్రంప్ విధించిన షరతులను హార్వర్డ్ తిరస్కరించడంతో విదేశీ విద్యార్థులకు ప్రవేశాన్ని నిషేధించారు. అయితే, ఇటీవల ఓ ఫెడరల్ న్యాయమూర్తి ఈ నిర్ణయాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ విదేశీయులపై ట్రంప్ మరిన్ని కఠిన ఆంక్షలు విధించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై దృష్టిసారించినట్లు సమాచారం.