breaking news
Temporary Visa
-
విదేశీయులకు ట్రంప్ మరో బిగ్ షాక్
వాషింగ్టన్: విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. విద్యార్ధులు,విజిటర్ల వీసాలపై నిర్ధిష్ట సమయాన్ని విధించనున్నారు. ఆ గడువు పూర్తయిన విద్యార్థులు, విజిటర్లు వారి వీసాల్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ కాకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో విదేశీయులపై ఆంక్షల కత్తి వేలాడుతున్నట్లైందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అక్రమ వలస దారులు అరికట్టేలా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు, టూరిస్టులు దేశంలో ఉండే సమయాన్ని నిర్ధేశించనుంది. ఆ సమయం గడువు దాటిన తర్వాత దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త వీసా ప్రతిపాదనలు తెచ్చింది.ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి, ప్రతి వీసాకు నిర్దిష్ట గడువు విధించాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం F-1 (విద్యార్థులు), J-1 (ఎక్స్చేంజ్ విజిటర్లు) వీసాలపై ఉన్నవారు తమ విద్యను కొనసాగిస్తున్నంత వరకు అమెరికాలో ఉండే హక్కు ఉంది. కొత్త ప్రతిపాదన అమలైతే, వారు పూర్తిగా గడువు ముగిసేలోపు దేశాన్ని విడిచి వెళ్లాలి లేదా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేయాలి.త్వరలోనే అమలుప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ సిద్ధం చేసి, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (OMB) సమీక్షకు పంపింది. ప్రజల అభిప్రాయాల కోసం 30–60 రోజుల గడువు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆ తరువాత ఈ కొత్త వీసా రూల్స్ అమల్లోకి రానున్నాయి. విదేశీ విద్యార్థులపై ట్రంప్ చర్యలు:ట్రంప్ పాలనలో అక్రమ వలసదారుల తొలగింపు, యూనివర్సిటీలపై నియంత్రణ పెరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీపై 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండింగ్‌ను నిలిపివేశారు. ట్రంప్ విధించిన షరతులను హార్వర్డ్ తిరస్కరించడంతో విదేశీ విద్యార్థులకు ప్రవేశాన్ని నిషేధించారు. అయితే, ఇటీవల ఓ ఫెడరల్ న్యాయమూర్తి ఈ నిర్ణయాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ విదేశీయులపై ట్రంప్ మరిన్ని కఠిన ఆంక్షలు విధించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై దృష్టిసారించినట్లు సమాచారం. -
‘జన్మతః పౌరసత్వ రద్దు’ బిల్లు సెనేట్‌కు
వాషింగ్టన్: అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాల మీద వలస వచ్చిన వాళ్లకు అమెరికాలో పిల్లలు పుడితే వారికి సంక్రమించే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంట్ ఎగువసభ(సెనేట్)లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు గురువారం ప్రవేశపెట్టారు. పుట్టే పిల్లలకు ఎలాగూ పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోందని ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యులు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రజ్, కేటీ బ్రిట్‌లు సెనేట్‌లో వ్యాఖ్యానించారు. ‘‘ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలోని 33 దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరకు ‘పుట్టుకల పర్యాటకం’లా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతః పౌరసత్వం కూడా ఒక ప్రధాన కారణం’’ అని రిపబ్లికన్ నేతలు చెప్పారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తుర్వును విపక్ష డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి ఉత్తర్వు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. -
ఈ ఏడాది హెచ్1బీ లేనట్లే
వాషింగ్టన్: అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్–1బీ, ఎల్–1 , ఇతర తాత్కాలిక వీసాలపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల రాకపై నియంత్రణ విధిస్తే దేశంలో స్థానికులకు అవకాశాలు వస్తాయన్నారు. ఫాక్స్ న్యూస్ చానెల్‌కి శనివారం ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ ఒకట్రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులపై సంతకం చేస్తానన్నారు. అయితే ఈ ఆంక్షల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.. ‘‘ఈ వీసాల అనుమతుల్లో కచ్చితంగా కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఏళ్లుగా అమెరికాలో ఉండి వ్యాపారాలు చేసే సంస్థలకు సంబంధించి ఎంతో కొంత మినహాయింపులు ఉంటాయి. కానీ మొత్తంగా చూస్తే వీసా విధానాన్ని బాగా కఠినతరం చేస్తాం. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో కనీవినీ ఎరుగని స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే, విదేశీయులకు అడ్డుకట్ట తప్పనిసరి’’అని ట్రంప్ చెప్పారు. ఏడాది చివరి వరకు వీసాలపై ఆంక్షలు కొనసాగే అవకాశాలున్నాయి. డాలర్ డ్రీమ్స్‌తో అమెరికా వెళ్లాలనుకొని హెచ్–1బీ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాదికి వీసా వచ్చే అవకాశాలు ఇక ఉండవు. కోవిడ్–19తో అల్లాడిపోయిన అగ్రరాజ్యంలో నిరుద్యోగం రేటు కనీవినీ ఎరుగని స్థాయిలో 4.1శాతం నుంచి 13.5శాతానికి పెరిగిపోయింది. కంప్యూటర్‌కు సంబంధించిన రంగాలలో నిరుద్యోగం రేటు 2020 జనవరిలో 3% ఉంటే, మే నాటికి 2.5% తగ్గింది. విదేశాల నుంచి నిపుణులైన పనివారిని తీసుకోకపోతే అమెరికా ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే ఎన్నో టెక్కీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ► ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపించనుంది. ఏటా జారీ చేసే 85 వేల హెచ్–1బీ వీసాల్లో 70శాతం ఇండియన్ టెక్కీలే. ► ట్రంప్ నిర్ణయంతో ఇండియన్ సర్వీసు కంపెనీలకంటే అమెరికా టెక్ సంస్థలపై ప్రభావం అధికంగా చూపించనుంది. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులైన టెక్కీలకు హెచ్–1బీ ద్వారా ఉద్యోగాల్లో తీసుకుంటున్నారు. ఇక ఇండియన్ సంస్థలు స్థానిక అమెరికన్లకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ► ఇప్పటికే అమెరికాలో హెచ్–1బీతో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చునని ఇమిగ్రేషన్ లాయర్లు వెల్లడించారు. ► అమెరికా పౌరసత్వం మరియు ఇమిగ్రేషన్ సర్వీసు గణాంకాల ప్రకారం 2016–19 మధ్య హెచ్–1బీలో భారత కంపెనీల వాటా 51% నుంచి 24%కి తగ్గిపోయింది. -
ఉద్యోగం వెతుక్కోవడానికి తాత్కాలిక వీసా..
విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న విద్యార్థులు తగిన ఉద్యోగం వెతుక్కోవడానికి వీలుగా ఆయా దేశాలు స్వల్పకాలిక ‘జాబ్ సీకర్ వీసా’ ఇచ్చినట్లుగానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశం ఇటీవల ముగిసిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకంలో ఆరు నెలల గడువుగల తాత్కాలిక వీసాలు ఇచ్చింది. అక్రమ వలసదారులు ఎలాంటి జరిమానా, జైలుశిక్ష లేకుండా తమ దేశాలకు వెళ్లిపోవడానికి వీలుగా యూఏఈ ప్రభుత్వం ఆగస్టు 1నుంచి డిసెంబర్ 31 వరకు ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమ్నెస్టీ పథకంలో దరఖాస్తు చేసుకున్న ప్రతిభావంతులకు, వృత్తి నిపుణులకు తాత్కాలిక వీసా అవకాశం కల్పించింది. ఆరు నెలల గడువులో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేనిపక్షంలో స్వదేశం వెళ్లిపోవాల్సి ఉంటుంది. -
గ్రీన్‌కార్డు ‘కోటా’ తొలగించాలి
అమెరికా రిపబ్లికన్ సభ్యుడు కెవిన్ వాషింగ్టన్: అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉద్యోగం చేస్తున్న విదేశీయులకు నైపుణ్యం, దరఖాస్తుల ఆధారంగా గ్రీన్‌కార్డులు(శాశ్వత నివాస ధ్రువీకరణ) మంజూరు చేయాలని, ప్రస్తుతమున్న కోటా విధానాన్ని రద్దు చేయాలని అమెరికన్ చట్టసభ ప్రముఖుడొకరు డిమాండ్ చేశారు. ప్రతీ దేశానికి ఒకే నిష్పత్తిలో కేటాయింపు కారణంగా భారత్, చైనా వంటి దేశాలకు చెందిన వృత్తి నిపుణులకు కేటాయింపులో అన్యాయం జరుగుతుందని రిపబ్లికన్ సభ్యుడు కెవిన్ యోదెర్ అన్నారు. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిశంసనకు సంబంధించి తొలి ఆర్టికల్(ఆర్టికల్ ఆఫ్ ఇంపీచ్మెంట్)ను డెమొక్రాట్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ ప్రవేశపెట్టారు. అమెరికా ఎన్నికల్లో రష్యా పాత్రకు సంబంధించి సాగుతున్న విచారణకు ట్రంప్ విఘాతం కల్గించారని ఆరోపిస్తూ ప్రతినిధుల సభలో ఆయన పెట్టిన తీర్మానంపై మరో డెమొక్రాట్ సభ్యుడు అల్ గ్రీన్ సంతకం చేశారు. పారిస్ ఒప్పందంపై నిర్ణయం మారొచ్చేమో: ట్రంప్ పారిస్: పారిస్ వాతావరణ ఒప్పందంపై తన నిర్ణయం మారొచ్చేమోనని ట్రంప్ గురువారం అన్నారు. ‘ఒప్పందంపై ఏదో ఒకటి జరగొచ్చు. చూద్దాం ఏమవుతుందో’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ తర్వాత ట్రంప్ వ్యాఖ్యానించారు.