
వరుసగా మూడో విజయం
5–0తో గోల్స్ తేడాతో ఇరాక్‌పై గెలుపు
ఆసియా కప్–2026 మహిళల ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీ
చియాంగ్ మాయ్ (థాయ్‌లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో అద్వితీయ విజయాలు సాధించిన భారత్... బుధవారం మూడో మ్యాచ్‌లో 5–0 గోల్స్ తేడాతో ఇరాక్‌ను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. భారత్ తరఫున సంగీత (14వ నిమిషంలో), మనీషా (44వ నిమిషంలో), కార్తీక అంగముత్తు (48వ నిమిషంలో), నిర్మలా దేవి (64వ నిమిషంలో), రతన్‌బాలా దేవి (80వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.
ఓవరాల్‌గా ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు... 22 గోల్స్ సాధించి ప్రత్యర్థికి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం విశేషం. తొలి మ్యాచ్‌లో 13–0 గోల్స్ తేడాతో మంగోలియాను చిత్తుచేసిన టీమిండియా... తిమోర్ లెస్టెపై 4–0 గోల్స్ తేడాతో నెగ్గింది. తాజా పోరులో సంగీత గోల్‌తో ఖాతా తెరిచిన భారత్... మనీషా గోల్‌తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 2–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో మూడు గోల్స్ కొట్టి మ్యాచ్‌ను ఏకపక్షం చేసింది.
గాయం కారణంగా తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోగా... మరింత ఆధిక్యం సాధించే పలు అవకాశాలను మన ప్లేయర్లు సది్వనియోగం చేసుకోలేకపోయారు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉండగా... బుధవారమే జరిగిన మరో మ్యాచ్‌లో 11–0 గోల్స్ తేడాతో మంగోలియాపై గెలిచిన థాయ్‌లాండ్ కూడా 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ కూడా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవగా... ఓవరాల్‌గా 22 గోల్సే చేసిన థాయ్‌లాండ్ అచ్చం టీమిండియా లాగే ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు.
గ్రూప్ నుంచి ఒక్క జట్టే ముందంజ వేసే అవకాశం ఉండటంతో... ఇరు జట్ల మధ్య శనివారం జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్ ప్రధాన టోర్నీలో ఆడింది. ఆ తర్వాత భారత జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.