
ఎనభై సంవత్సరాల వయసులో కొద్ది దూరం నడిచినా అలసటగా అనిపిస్తుంది. ‘సాహసం’ అనే మాట ఊహకు అందదు. అయితే డా. శ్రద్దా చౌహాన్ మాత్రం ‘తగ్గేదే ల్యా’ అని డిసైడై పోయింది. సాహసానికి సై అంది. స్కైడైవింగ్‌తో తన 80వ పుట్టిన రోజు జరుపుకున్న శ్రద్ధ చరిత్ర సృష్టించింది. ‘స్కైడైవింగ్’ అనే మాట తల్లి నోటి నుంచి వినిపించిన క్షణమే ‘ఓకే’ అన్నాడు ఆమె కుమారుడు సౌరభ్ సింగ్ షెకావత్.
శ్రద్ధ భర్తతోపాటు, రెండవ కుమారుడు మాత్రం... ‘ఈ వయసులో చాలా కష్టం. వద్దు’ అన్నారు. వారిని ఒప్పించి రంగంలోకి దిగారు తల్లీకొడుకులు. స్కైడైవర్ అయిన షెకావత్ ‘స్కై హై ఇండియా’ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్. పర్వతారోహణలో, గుర్రపు స్వారీలో దిట్ట అయిన షెకావత్‌కు సాహసాలు కొత్త కాదు. వర్టిగో, సర్వికల్ స్పాండిలైటిస్‌లాంటి సమస్యలతో బాధ పడుతున్నప్పటికీ 10,000 అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ.
‘ఏ మదర్: ఏ మైల్‌స్టోన్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియో విషయానికి వస్తే...షెకావత్ మొదట తన తల్లిని పరిచయం చేస్తాడు. ‘మా అమ్మతో కలిసి ఈ సాహసంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నాడు షెకావత్.
స్కైడైవింగ్ చేయాలనేది శ్రద్ధ చౌహాన్ చిన్నప్పటి కల. ఎట్టకేలకు కుమారుడి సహకారంతో తన కల నెరవేర్చుకుంది. ‘ఇది నేను గర్వించే సందర్భం’ అని సంతోషం నిండిన కళ్లతో అంటుంది డా.శ్రద్ధా చౌహాన్. ఈ ఇన్‌స్టాగ్రామ్ వైరల్ వీడియో సాహసానికి మాత్రమే కాదు తల్లీకొడుకుల అనుబంధానికి కూడా అద్దం పడుతుంది.
(చదవండి: Shubhanshu Shuklas mission: మధుమేహం ఉన్నవాళ్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చా..? )