
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (జులై 2) జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంక 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక సారధి చరిత్ అసలంక సూపర్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి 123 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది.
లంక ఇన్నింగ్స్‌లో అసలంక మినహా ఎవ్వరూ రాణించలేదు. కుసాల్ మెండిస్ (45), జనిత్ లియనాగే (29), మిలన్ రత్నాయకే (22), హసరంగ (22) రెండంకెల స్కోర్లు చేశారు. పథుమ్ నిస్సంక, కమిందు మెండిస్ డకౌటయ్యారు. నిషాన్ మదుష్క 6, తీక్షణ 1, ఎషాన్ మలింగ 5, అశిత ఫెర్నాండో 1 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిలో తస్కిన్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ 3 వికెట్లు తీశాడు. తన్వీర్ ఇస్లాం, షాంటో తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. హసరంగ (7.5-2-10-4), కమిందు మెండిస్ (5-0-19-3), మహీశ్ తీక్షణ (9-1-32-1) మాయాజాలం దెబ్బకు 35.5 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ (62), జాకిర్ అలీ (51) అర్ద సెంచరీలతో రాణించారు.
మిగతా బ్యాటర్లలో పర్వేజ్ ఎమోన్ (13), నజ్ముల్ షాంటో (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లిట్టన్ దాస్, కెప్టెన్ మెహిది హసన్, తస్కిన్ అహ్మద్ డకౌట్లు కాగా.. తౌహిద్ హృదోయ్, తంజిమ్ సకీబ్ తలో పరుగు చేశారు. తన్వీర్ ఇస్లాం 5 పరుగులు చేశాడు. రెండో వన్డే కొలొంబో వేదికగానే జులై 5న జరుగనుంది.
కాగా, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. తొలి వన్డేలో గెలుపుతో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది.