
రూ.48,000 కోట్లకు చేరిన ఏయూఎం
ఏడాది కాలంలో 37 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు మంచి డిమాండ్ నెలకొంది. ఈ విభాగంలో సుమారు 22 మ్యూచువల్ ఫండ్స్ పథకాలు సేవలు అందిస్తున్నాయి. వీటి నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏడాది కాలంలో 37 శాతం వృద్ధితో రూ.48,000 కోట్లకు చేరుకున్నాయి. 2024 మే చివరికి వీటి నిర్వహణ ఆస్తులు రూ.34,971 కోట్లుగా ఉండడం గమనార్హం.
ఈ విభాగంలోని పథకాలు మంచి పనితీరు చూపించడం ఏయూఎంలో బలమైన వృద్ధికి కారమైనట్టు తెలుస్తోంది. ఈ పథకాలు గత ఏడాది కాలంలో పెట్టుబడులపై 22 శాతం నుంచి 30 శాతం వరకు రాబడులను అందించడం గమనార్హం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న దీర్ఘకాల విశ్వాసానికి నిదర్శనంగా దీన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీఎస్‌ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 14 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో ప్రధాన సూచీ సెన్సెక్స్ పెరుగుదల 10 శాతంగానే ఉంది. అలాగే బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో బీమా, ఫిన్‌టెక్, వెల్త్ మేనేజ్‌మెంట్, డిజిటల్‌గా రుణాలు అందించే అన్‌లిస్టెడ్ కంపెనీల్లోనూ ఈ తరహా ఫండ్స్ పెట్టుబడులు పెడుతుండడం ఇన్వెస్టర్లు ఆకర్షిస్తోంది. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితంగా మారుతుండడం, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం విస్తరిస్తుండడంతో ఈ విభాగంలో బలమైన కంపెనీల సంఖ్య పెరుగుతోంది. దీంతో దీర్ఘకాలంలో మంచి పెట్టుబడుల అవకాశాలను ఈ రంగం ఆఫర్ చేస్తోంది’’అని వెల్త్ మేనేజర్ అల్ఫాషా పేర్కొన్నారు.