
సాక్షి,బళ్లారి(కర్ణాటక): వారిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామని ఆశపడ్డారు. కానీ ఆటో రిక్షాలో శవాలై తేలారు. ఇది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు వ్యాపించాయి. వివరాలు.. బెళగావి జిల్లాలో గోకాక్ వద్ద సవదత్తి తాలూకా మనవళ్లికి చెందిన రాఘవేంద్ర జాదవ్ (28), రంజిత (26) అనే ఇద్దరు ఊరి బయట ఆటోలో విగతజీవులై కనిపించారు.
కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, అయితే వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని తెలిసింది. ఇటీవల ఆమెకు మరొకరితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఆవేదనకు గురైన ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు చిక్కనంది సమీపంలో ఆటోలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. సమగ్ర విచారణ జరిపించాలని జాదవ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గోకాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లవ్ బ్రేకప్.. ప్రియుడు ఆత్మహత్య
మైసూరు: ప్రేమించిన యువతి ముఖం చాటేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకా బన్నితాళపుర గ్రామంలో జరిగింది. సాగడె గ్రామానికి చెందిన సంతు అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే తాను మరో యువకున్ని ప్రేమిస్తున్నట్లు సంతు వాట్సాప్‌కు మెసేజ్ పంపింది. దీంతో విరక్తి చెందిన సంతునా మరణానికి ప్రియురాలే కారణం, ఆమె వదిలేయడంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు పలువురికి మెసేజ్‌లు పంపాడు. తమ ఇద్దరి ఫోటోని స్టేటస్‌లో పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్లుపేటె పోలీసులు కేసు నమోదు చేశారు.