
అమెరికాకు 5 నెలల్లో 10,300 మంది
వాషింగ్టన్: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 10,300 మందికి పైగా భారతీయులు అక్రమంగా అమెరికా లోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. అయితే 2024తో పోలిస్తే భారతీయుల అక్రమ వలసలు 70 శాతం తగ్గినట్టు వెల్లడించింది. గతేడాది జనవరి– మే మధ్య 34,535 మంది భారతీ యులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డారు.
అంటే సగటున రోజుకు 230 మంది! 2025లో ఇది రోజుకు 69కి తగ్గింది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కఠినతరం చేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. అమెరికా లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో గుజరాత్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ఊహించే స్మగ్లింగ్ సిండికేట్ 2024 చివరి నుంచి తమ కార్యకలాపాలను తగ్గించిందని నివేదిక పేర్కొంది.
ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 6 లక్షలకు పైగా అక్రమ వలసదారులను అమెరికా సరిహద్దుల వద్ద అరెస్టు చేసింది. 2024లో ఇదే కాలంలో 12,33,959 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో 30 మంది ఒంటరి మైనర్లున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 500 మందికి పైగా భారతీయ మైనర్లను అమెరికా అరెస్టు చేసింది. అనేక దేశాల నుంచి ఏటా వేలాది మంది తమ పిల్లలను అమెరికా–మెక్సికో, అమెరికా–కెనడా సరిహద్దులో వదిలి వెళ్తారు. వారికి అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఇలా చేస్తుంటారు. ఈ పిల్లలంతా 12–17 ఏళ్లు, అంతకంటే చిన్న వయసు వారని నివేదికలు చెబుతున్నాయి.
పత్రాల్లేని వారు 2.2 లక్షలు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) 2024 ఏప్రిల్ నివేదిక ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతి పత్రాలూ లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివకరూ 332 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. అయినా ప్రమాదకరమైన డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి భారతీయులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లోనూ వెళ్తున్నారు. గత మే 9న కాలిఫోర్నియా తీరంలోని డెల్మార్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 ఏళ్ల భారతీయ బాలుడు, అతని 10 ఏళ్ల అతని సోదరి మరణించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్