
పాశమైలారం ఘటన తర్వాత సిగాచి కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆ కంపెనీ నుంచి కనీస స్పందన కూడా కరువైందని తెలంగాణ ప్రభుత్వం కూడా సిగాచి తీరుపై సీరియస్‌గా ఉంది. ఈ తరుణంలో ఎట్టకేలకు ఆ సంస్థ స్పందించింది.
సాక్షి, సంగారెడ్డి: పటాన్‌చెరు పాశమైలారం ప్రమాదంలో ఎట్టకేలకు మేనేజ్‌మెంట్ అయిన సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్పందించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని చెబుతూ బుధవారం ఒక ప్రకటన చేసింది.
‘‘మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇస్తాం. ప్రమాదంలో 40 మంది మరణించారు. మరో 33 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు పూర్తి వైద్య సాయం అందిస్తాం’’ అని తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని.. కారణాలు తెలియరావాల్సి ఉందని అంటోంది.

అలాగే ప్రమాద తీవ్ర దృష్ట్యా 90 రోజులపాటు కంపెనీ మూసివేతకు నిర్ణయించింది. ప్రమాదంపై నేషనల్ స్టాక్ ఎక్సేంజికి ఓ లేఖ ద్వారా సిగాచి సమాచారం అందించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇటు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి వద్ద ఇవాళ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితుల పరామర్శకు వెళ్లిన కంపెనీ వైస్ చైర్మన్ చిదంబర్‌తో కార్మికుల కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా చిదంబర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘30 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమయంలో లోపల 60 మంది ఉన్నారు. ఘటన తర్వాత కార్మికుల యోగక్షేమాలను కంపెనీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. నిన్నటి సీఎం పర్యటనలో సంస్థ ప్రతినిధులు ఉన్నారు. మా పరిశ్రమవాళ్లు లేరని సీఎం ఎందుకు అన్నారో నాకు తెలియదు. నా అనారోగ్యం వల్ల రాలేకపోయాను. అయినా కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ, తదితర అధికారులతో టచ్‌లోనే ఉన్నారు’’ అని సిగాచి వైస్ చైర్మన్ చిదంబర్ అన్నారు.
సిగాచి ప్రమాద స్థలిని మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ సమయంలో అక్కడ నిర్వహించిన సమీక్షలోనూ సిగాచి ప్రతినిధులపై సీఎం రేవంత్ అరా తీశారు. ఫ్యాక్టరీ తరఫున ఎవరూ లేకపోవడంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు కూడా.
ఇదిలా ఉంటే.. పాశమైలారం ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ.. కంపెనీ నుంచి వసూలు చేసి ఇప్పిస్తామని, ఇందుకు మంత్రులతో అవసరమైతే చర్చలు జరిపిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే.. తక్షణ సాయం కింద ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు లక్ష, గాయపడినవాళ్లకు రూ.50 వేలు ప్రకటించారాయన. అలాగే బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సాయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపడతామని, కమిటీ నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ ప్రకటించారు.