
అనకాపల్లి టౌన్: మాంసాహార ప్రియులకు పండగే పండగ. చికెన్ ధర గణనీయంగా తగ్గింది. బుధవారం జిల్లాలో డ్రెస్డ్ కోడి మాంసం రూ.150లకు, స్కిన్‌లెస్ రూ.160లకు విక్రయించారు. ఆదివారం వచ్చిందంటే చికెన్ ముక్క లేనిదే చాలామందికి ముద్ద దిగదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎక్కువగా చికెన్ మాంసాన్ని ఇష్టపడతారు. ప్రొటీన్ శాతం ఎక్కువ ఉంటుందని వైద్యులు సైతం మేక మాంసం కంటే కోడి మాంసం మేలని చెబుతారు.
ధర కూడా మేక మాంసం కంటే తక్కువ ఉండడంతో చాలామంది ఇళ్లలో చికెన్‌కే ప్రాధాన్యం. సాధారణంగా ఈ రోజుల్లో కేజీ చికెన్ ధర రూ.200 నుంచి రూ.250 మధ్య ఉంటుంది. కానీ మంగళ, బుధవారాల్లో లైవ్ చికెన్ రూ.90, డ్రెస్డ్ రూ.150, స్కిన్‌లెస్ రూ.160లకు లభించింది. గత వారం రూ.200 దాటిన కేజీ చికెన్ ధర ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోయింది.
ఆరా తీయగా పూరి జగన్నాథస్వామి ఉత్సవాల ప్రభావమే కారణమని తెలిసింది. అనకాపల్లి జిల్లా నుంచి ఒడిశా రాష్ట్రానికి బ్రాయిలర్ కోళ్లు ఎక్కువగా ఎగుమతి అవుతాయని, ప్రస్తుతం రథోత్సవం అనంతరం 10 రోజులపాటు వేడుకలు జరగడంతో డిమాండ్ గణనీయంగా తగ్గిపోయిందని హోల్‌సేల్ వ్యాపారులు తెలిపారు. జిల్లాలో కూడా దాదాపు అన్ని చోట్ల జగన్నాథస్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. మారు రథయాత్ర జరిగే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని చెబుతున్నారు.