బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ! | AP High Court shock with Chandrababu govt conspiracies on YS Jagan | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ!

Jul 3 2025 5:09 AM | Updated on Jul 3 2025 7:48 AM

AP High Court shock with Chandrababu govt conspiracies on YS Jagan

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తదితరులపై నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవు... అందుకే మేం జోక్యం చేసుకుంటున్నాం

అలా జోక్యం చేసుకునే అరుదైన, అసాధారణ కేసుల్లో ఇది ఒకటి.. 

బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 కింద కేసు పెట్టడంపై హైకోర్టు తీవ్ర విస్మయం 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తదితరులు ప్రయాణికులు మాత్రమే 

వారిపై సెక్షన్‌ 105 కింద కేసు పెట్టేందుకు ప్రాథమిక ఆధారాల్లేవు 

ఈ సెక్షన్‌ కింద కేసు పెట్టాలంటే వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం ఉండాలి 

అలాగే తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని వారికి తెలిసి ఉండటం తప్పనిసరి 

కానీ ఈ కేసులో జగన్‌ తదితరులకు ఎవరినీ చంపాలన్న ఉద్దేశం లేదు 

తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని వారికి తెలియదు.. 

అందువల్ల వారిని సెక్షన్‌ 105 పరిధిలోకి తీసుకురాలేరు 

సాధారణంగా ఎఫ్‌ఐఆర్‌ దశలో మేం జోక్యం చేసుకోం.. 

నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు జోక్యం చేసుకోవచ్చు 

తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిస్తున్నాం 

సింగయ్య మృతి కేసులో సర్కారు తప్పుడు వాదనను ఎండగడుతూ హైకోర్టు కీలక తీర్పు

ఇదో అసాధారణ కేసు.. సాధారణంగా ఎఫ్‌ఐఆర్‌ దశలో మేం జోక్యం చేసుకోం.. కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసు.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తదితరులు కేవలం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే. సెక్షన్‌ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే.. జగన్‌ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదు.
– సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటి ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. సింగ­య్య­ను ఉద్దేశపూర్వకంగానే కారు కింద పడేసి తొక్కించా­రంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాద­నను హైకోర్టు ఎండగట్టింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తదిత­రులపై బీఎన్‌ఎస్‌లోని కఠిన సెక్షన్‌ 105 కింద కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. 

జీవిత ఖైదు పడే ఈ సెక్షన్‌ కింద జగన్‌ తదితరులపై ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఆక్షేపించింది. సెక్షన్‌ 105 కింద కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సాధారణంగా ఏ కేసులో కూడా ఎఫ్‌ఐఆర్‌ దశలో తాము జోక్యం చేసుకోమని, అయితే ఇది జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసని, అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని ప్రకటించింది. 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, జగన్‌ పీఏ నాగేశ్వరరెడ్డిలపై పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌– ఓ వ్యక్తి మర­ణా­నికి కారణమైనప్పటికీ హత్య కానిది) కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జగన్‌ తదితరులు కేవలం కారులో ప్రయా­ణిç­Ü్తున్న ప్రయాణికులు మాత్రమేనని స్పష్టం చేసింది. 

సెక్షన్‌ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపా­లన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపో­తారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి అని, అప్పుడు మాత్రమే ఆ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీ­లిస్తే, జగన్‌ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపో­తా­రని తెలిసి ఉండటం గానీ జరగలేదంది. 

సాధారణంగా తాము ఏ కేసులో కూడా ఎఫ్‌ఐఆర్‌ దశలో జోక్యం చేసుకోబో­మని, అయితే ఎఫ్‌ఐఆర్‌లోని నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవన్న నిర్ణయానికి వస్తే మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండలేమంది. జోక్యం చేసుకోకుండా ఉండే విష­యంలో ఎలాంటి నిషేధం లేదంది. 

అలా జోక్యం చేసుకోవాల్సి­నటు­వంటి అరుదైన కేసుల్లో ఈ కేసు కూడా ఒకటని, అందువల్ల ఈ కేసులో జోక్యం చేసు­కుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తు­న్నట్లు తెలిపింది. జగన్‌ తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్య­లన్నింటినీ నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాస­రెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది.



దుర్గారావు చెప్పింది ఇదీ...
‘ఈ కేసులో నిమ్మకాయల దుర్గారావు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ కోర్టు పరిశీలించింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఘటన జరిగిన రోజు ఉదయం 10.30–11 గంటలకు మాజీ సీఎం కాన్వాయి తాడేపల్లి వైపు నుంచి జాతీయ రహదారి వైపు వచ్చింది. కారు డ్రైవర్‌కు సమీపంలో మాజీ సీఎం నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలందరూ ఆయన వైపు పరిగెత్తుకెళ్లారు. దీంతో మాజీ సీఎం కారు నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అభివాదం చేశారు. 

ఈ సమయంలోనే కారు ఎడమ వైపు సర్వీసు రోడ్డులోకి తిరిగింది. ఓ వ్యక్తి డ్రైవరు వైపు ఉన్న కారు చక్రం కింద పడ్డారు. వెంటనే కాన్వాయిలో ఉన్న నలుగురు ఆ వ్యక్తిని పక్కకు తీసి చెట్ల కిందకు తీసు­కెళ్లారు. ఆ తరువాత కాన్వాయి సర్వీసు రోడ్డులోకి వచ్చింది. అనంతరం గాయపడిన వ్యక్తిని చూసేందుకు వెళ్లా. కొద్దిసేపటికి అంబులెన్స్‌లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

గాయపడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ తరువాత నాకు తెలిసింది ఏమిటంటే గాయపడిన వ్యక్తి మరణించాడు..’ అని దుర్గారావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తెలిపారు. పోలీ­సులు దుర్గారావు ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఆధా­రంగా చేసుకుని మొదట పెట్టిన బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యారంటూ)ను సెక్షన్‌ 105 కింద మార్చారని పేర్కొన్నారు.

అలా చనిపోతారని జగన్‌ తదితరులకు తెలుసని పోలీసులు చెబుతున్నారు...
దర్యాప్తులో భాగంగా పోలీసులు మాజీ సీఎం వెంట ఉన్న భద్రతా సిబ్బందిని విచారించారని న్యాయ­మూర్తి తెలిపారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారని, అనంతరం జూన్‌ 25న పోలీసులు మేజి­స్ట్రేట్‌ ముందు ఓ మెమో దాఖలు చేశారన్నారు. టర్నింగ్‌ తీసుకునే సమయంలో కారును వేగంగా నడపడం వల్ల ప్రజలు కారు కింద పడి మరణి­స్తారని డ్రైవర్‌తోపాటు ఆ కారులో ఉన్న జగన్‌ తదితరులకు స్పష్టంగా తెలుసునని పోలీసులు ఆ మెమోలో పేర్కొన్నారన్నారు. 

జగన్‌ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్‌కు చెప్పారని, అందువల్లే భారీగా జనాలు ఉన్న చోట కారును వేగంగా నడిపారని పోలీసులు ఆ మెమోలో చెప్పారని తెలి­పారు. అయితే సెక్షన్‌ 105 వర్తించాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల చని­పోతాడని తెలిసి ఉండటం తప్పనిసరని, ఈ కేసులో జగన్‌ తదితరులకు చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదన్నారు. అందువల్ల వారిని సెక్షన్‌ 105 పరిధిలోకి తీసుకురాలేరని తేల్చి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement