
వింబుల్డన్‌లో సంచలనాల పర్వం
క్విటోవా కూడా...
సినెర్, జొకోవిచ్ ముందంజ
అల్‌కరాజ్, సబలెంక మూడో రౌండ్లోకి...
వింబుల్డన్‌లో సంచలనాల మోత! ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకొచ్చిన కోకో గాఫ్, గత వారం జర్మనీలో ఇగా స్వియాటెక్‌ను ఓడించి టైటిల్‌తో ఈ గ్రాస్‌కోర్టులోకి దిగిన పెగూలా, రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ క్విటొవా, ఈ ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ లోరెంజో ముసెట్టి, మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్, మెద్వెదెవ్, రూనె, ఐదోసీడ్ జెంగ్ క్విన్‌వెన్, 15వ సీడ్ కరోలినా ముకొవా... ఇలా టాప్ స్టార్లకు ఈ వింబుల్డన్ చేదు ఫలితాలనిచ్చింది. పెద్ద సంఖ్యలో సీడెడ్ ప్లేయర్లు మోయలేని భారంతో తొలి రౌండ్లోనే నిష్క్రమించేలా చేసింది.
లండన్: గ్రాస్‌కోర్టు గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ ఈ సారి మూడు రోజులకే వెలవెలబోతోంది. పలువురు మేటి స్టార్లంతా ఈ కోర్టులో తొలి రౌండ్‌లోనే ఆఖరి మ్యాచ్ ఆడేసి వెళ్లిపోయారు. మిగిలిన కొద్దిమందిలో ఇంకెంత మంది కనీసం ప్రిక్వార్టర్స్ వరకైనా చేరతారో తెలియని పరిస్థితి. సంచలన ఫలితాలతో పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఒకరో ఇద్దరో కాదు... ఏకంగా 23 మంది సీడెడ్ స్టార్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్‌లో 10 మంది, పురుషుల సింగిల్స్‌లో 13 మంది స్టార్లు... 2001 నుంచి టాప్–32 సీడింగ్స్‌ను గుర్తించాక ఇంత మంది సీడెడ్లు తొలి రౌండ్‌లోనే కంగుతినడం మొత్తం గ్రాండ్‌స్లామ్‌ల చరిత్రలోనే మొదటిసారి!
ఫ్రెంచ్ ఓపెన్ తాజా చాంపియన్, అమెరికన్ స్టార్ కోకో గాఫ్ కథ తొలిరౌండ్లోనే అది కూడా క్వాలిఫయర్ చేతిలో ముగిసింది. రెండు వింబుల్డన్ టైటిళ్ల విజేత పెట్రా క్విటోవా మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం విక్రమార్క పోరాటం చేస్తున్న సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌తో పాటు ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ శుభారంభం చేశారు.
మూడో రౌండ్లో సబలెంక, అల్‌కరాజ్
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో బెలారస్ స్టార్, టాప్ సీడ్ సబలెంక 7–6 (7/4), 6–4తో మేరి బౌజ్‌కొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ సీజన్‌లో రెండు గ్రాండ్‌స్లామ్ (ఆ్రస్టేలియా, ఫ్రెంచ్) టోర్నీల్లోనూ రన్నరప్‌గా నిలిచిన సబలెంకకు తొలిసెట్‌లో అన్‌సీడెడ్ ప్లేయర్ గట్టి పోటీ ఇచ్చినా టైబ్రేకర్‌తో గెలుపుబాట పట్టింది. మరో పోరులో ఆరో సీడ్ మాడిసన్ కీస్ 6–4, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై వరుస సెట్లలో విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో వింబుల్డన్ (2023, 2024) ‘హ్యాట్రిక్’పై కన్నేసిన కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్) సునాయాస విజయంతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో సీడ్ స్పెయిన్ స్టార్ 6–1, 6–4, 6–4తో బ్రిటన్ ప్లేయర్ టార్వెట్‌ను ఓడించాడు. రెండోరౌండ్లో 12వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫె (అమెరికా)కు చుక్కెదురైంది. గత యూఎస్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ టియాఫె 6–4, 4–6, 3–6, 5–7తో కామెరూన్ నోరి (బ్రిటన్) చేతిలో కంగుతిన్నాడు. 14వ సీడ్ రుబ్లెవ్ 6–7 (1/7), 6–4, 7–6 (7/5), 6–3తో లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు.
డయానా సంచలనం
ఉక్రెయిన్ ప్లేయర్ డయానా యస్త్రెంస్కా లండన్‌లో టైటిల్ గెలవకుండానే పతాక శీర్షికల్లో నిలిచింది. 2018 నుంచి గ్రాండ్‌స్లామ్ బరిలో దిగుతున్నప్పటికీ ఏనాడూ సాధ్యమవని విజయాన్ని ఈ వింబుల్డన్ తొలి రౌండ్లోనే సాకారం చేసుకుంది. పారిస్ మట్టికోర్టులో (ఫ్రెంచ్ ఓపెన్)లో మహారాణిగా నిలిచిన అమెరికన్ స్టార్, రెండో సీడ్ కోకో గాఫ్‌కు కనీవినీ ఎరుగని షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ అనామక ప్లేయర్‌ను సులువుగానే ఓడిస్తుందనుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్ గాఫ్ 6–7 (3/7), 1–6తో 42వ ర్యాంకర్ డయానా య్రస్తెంస్కా చేతిలో ఘోర పరాభవానికి గురైంది.
ప్రపంచ నాలుగో ర్యాంకర్ పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ తొలి రౌండ్‌ను వరుస సెట్లలోనే గెలిచింది. రష్యన్ ప్రత్యర్థి నుంచి తొలిసెట్లో ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల చాంపియన్ అయిన స్వియాటెక్ 7–5, 6–1తో పొలినా కుడెర్మటోవాపై గెలుపొందింది. 17వ సీడ్ బార్బర క్రెజ్సికొవా (చెక్ రిపబ్లిక్) 3–6, 6–2, 6–1తో అలెగ్జాండ్రా ఎలా (ఫిలిప్పీన్స్)పై నెగ్గింది.
ఇంతేనా... మిగిలింది!
చెప్పుకోదగ్గ స్టార్లు, కనీసం సెమీఫైనల్ గ్యారంటీ అనుకున్న ప్లేయర్లు సైతం ఆదిలోనే కంగు తినడంతో ఇక మిగిలింది కొందరే! నంబర్‌వన్ సబలెంక, మూడో టైటిల్‌పై కన్నేసిన డిఫెండింగ్ చాంపియన్ అల్‌కరాజ్, 2023 వింబుల్డన్ చాంపియన్ మార్కెటా వొండ్రుసొవా, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను, పదో సీడ్ ఎమ్మా నవారో, యానిక్ సినెర్, రజతోత్సవ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్ తదితర స్టార్లే మిగిలారు. అయితే ఇంతటి సంచలనాల పర్వంలో ఇక వీరిలో ఎవరెవరు క్వార్టర్స్ దాటుతారనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.
రెండో రౌండ్లోకి యూకీ జోడీ
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన అమెరికన్ భాగస్వామితో కలిసి శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో 16వ సీడ్ యూకీ–రాబర్ట్ గాలొవే ద్వయం 7–6 (10/8), 6–4తో అర్నియోడో (మొనాకో)–గినార్డ్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. రిత్విక్ బొల్లిపల్లి–బారియెంటోస్ (కొలంబియా) జోడీ 4–6, 6–4, 7–6 (13/11)తో గాఫిన్ (బెల్జియం)–ముల్లర్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. వెటరన్ స్టార్ రోహన్ బోపన్న ద్వయంకు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. బోపన్న–సాండర్ గిల్లీ (బెల్జియం) జోడీ 3–6, 4–6తో మూడో సీడ్ క్రావిట్జ్ (జర్మనీ)–ప్యూట్జ్ (జర్మనీ) జంట చేతిలో ఓడింది.
జొకోవిచ్ కష్టపడి...
బిగ్–3లో కెరీర్‌ను కొనసాగిస్తున్న సెర్బియన్ దిగ్గజం జొకోవిచ్ రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి సవాళ్లు ఎదురైనా అనుభవంతో అధిగమించాడు. ఆరో సీడ్ జొకో 6–1, 6–7 (7/9), 6–2, 6–2తో ముల్లర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. తొలిరౌండ్లో మూడు గంటలకు పైగానే కోర్టులో శ్రమించి టోర్నీలో శుభారంభం చేశాడు. ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) మాత్రం అలవోక విజయంతో ముందంజ వేశాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ఫ్రెంచ్ రన్నరప్ సినెర్ 6–4, 6–3, 6–0తో తన దేశ సహచరుడు ల్యూకా నార్డిని ఓడించగా... నాలుగో సీడ్ డ్రాపర్ (బ్రిటన్) 6–2, 6–2, 2–1తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి బేజ్ (అర్జెంటీనా) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–7 (6/8), 6–7 (8/10), 6–4, 7–6 (8/6), 6–4తో పెరికార్డ్ (ఫ్రాన్స్)పై ఐదు సెట్ల పోరాటం చేసి గట్టెక్కాడు.