
నేడు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్
రాత్రి గం. 8:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
లండన్: ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు వేళయింది. ఆదివారం జరగనున్న ఈ తుది పోరులో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సినెర్ (ఇటలీ), రెండో ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్) అమీతుమీ తేల్చుకోనున్నారు. గత నెల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనూ ఈ ఇద్దరే తలపడగా... అల్‌కరాజ్ విజేతగా నిలిచాడు. ఇలా ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్‌లో ఆ ఇద్దరు ఆటగాళ్లే ఫైనల్లో తలపడనుండటం రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) తర్వాత ఇదే తొలిసారి.
ఈ ఇద్దరు దిగ్గజాలు 2006–2008 మధ్య వరుసగా మూడేళ్ల పాటు ఈ రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఢీకొన్నారు. ఆ ఇద్దరు కెరీర్‌కు వీడ్కోలు పలకగా... 38 ఏళ్ల జొకోవిచ్ కూడా గతంలో మాదిరిగా దూకుడు కనబర్చలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నవతరం నిలకడ కనబరుస్తోంది. అందులో ముఖ్యంగా 22 ఏళ్ల అల్‌కరాజ్, 23 ఏళ్ల సినెర్ తమ పోరాట పటిమతో అభిమానుల మనసు దోచుకుంటున్నారు. అల్‌కరాజ్ ఇప్పటివరకు ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవగా... సినెర్ మూడు నెగ్గాడు.
గత 6 మేజర్ టైటిల్స్‌ను ఈ ఇద్దరే పంచుకోవడం విశేషం. ‘భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం లేదు. ప్రస్తుతానికైతే సినెర్‌తో పోటీని ఆస్వాదిస్తున్నా. మున్ముందు కూడా ఇలాగే సాగుతుందని చెప్పలేను. దిగ్గజాల సరసన మా పేర్లు జోడించడం ఆనందమే’ అని అల్‌కరాజ్ అన్నాడు. వింబుల్డన్‌లో గత రెండేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఈ స్పెయిన్ యంగ్‌స్టర్... ‘హ్యాట్రిక్’పై కన్నేశాడు. ఇప్పటి వరకు జాన్ బోర్గ్, సంప్రాస్, ఫెడరర్, జొకోవిచ్ వింబుల్డన్‌లో వరుసగా మూడు టైటిల్స్ సాధించగా... ఇప్పుడు ఆ జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాలని అల్‌కరాజ్ తహతహలాడుతున్నాడు.
సినెర్‌కు ఇది వరుసగా నాలుగో మేజర్ ఫైనల్ కాగా అందులో యూఎస్ ఓపెన్, ఆ్రస్టేలియా ఓపెన్‌లో విజయాలు సాధించాడు. గత నెలలో వీరిద్దరి మధ్య రోలాండ్ గారోస్‌లో 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ ఫైనల్లో సినెర్‌పై అల్‌కరాజ్ విజయం సాధించగా... ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఇటలీ ప్లేయర్ భావిస్తున్నాడు.