
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో సినెర్, అల్‌కరాజ్
లండన్: కెరీర్‌లో రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రస్థానం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్, ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ సెమీఫైనల్లో నిష్క్రమించాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) అద్భుతంగా ఆడి 6–3, 6–3, 6–4తో వరుస సెట్‌లలో జొకోవిచ్‌ను ఓడించి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2017 తర్వాత వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ ఫైనల్ చేరుకోకపోవడం ఇదే తొలిసారి.
గత రెండేళ్లు ఫైనల్లో అల్‌కరాజ్ చేతిలో ఓడిన జొకోవిచ్ 2018, 2019, 2021, 2022లలో విజేతగా నిలిచాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించలేదు. జొకోవిచ్‌తో 1 గంట 55 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సినెర్ 12 ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేశాడు. జొకోవిచ్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు 28 అనవసర తప్పిదాలు చేశాడు.
‘హ్యాట్రిక్’ టైటిల్‌పై అల్‌కరాజ్ గురి
తొలి సెమీఫైనల్లో 2023, 2024 చాంపియన్ అల్‌కరాజ్ (స్పెయిన్) 2 గంటల 49 నిమిషాల్లో 6–4, 5–7, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచాడు. వరుసగా మూడో ఏడాది ఈ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సినెర్‌తో అల్‌కరాజ్ తలపడతాడు. అల్‌కరాజ్ గెలిస్తే... జాన్ బోర్గ్, సంప్రాస్, ఫెడరర్, జొకోవిచ్ తర్వాత వింబుల్డన్‌లో ‘హ్యాట్రిక్’ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్‌గా నిలుస్తాడు.
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
స్వియాటెక్ (పోలాండ్) X అనిసిమోవా (అమెరికా)
రాత్రి గం. 8:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం