
మూడు గ్రాండ్‌స్లామ్‌లనూ సాధించిన ఇగా స్వియాటెక్
తదుపరి లక్ష్యం ఆ్రస్టేలియన్ ఓపెన్
వింబుల్డన్‌లో జైత్రయాత్ర
సాక్షి క్రీడా విభాగం : 2019...ఇగా స్వియాటెక్ తొలి సారి గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగిన ఏడాది. అంటే 2020లో నిర్వహించని వింబుల్డన్‌ను మినహాయిస్తే 26 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆమె బరిలోకి దిగింది. ఏడేళ్ల కెరీర్ కూడా పూర్తి కాకముందే ఆమె ఖాతాలో ఇప్పుడు ఆరు టైటిల్స్ ఉన్నాయి. 24 ఏళ్ల వయసుకే ఇన్ని ఘనతలు సాధించిన ఇగా... పురుషుల, మహిళల విభాగంలో వింబుల్డన్ నెగ్గిన తొలి పోలండ్ ప్లేయర్‌గా నిలిచింది. దూకుడైన ఆటతో ఆమె అన్ని సర్ఫేస్‌లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. స్వయంగా ఇగా మాటల్లోనే చెప్పాలంటే ‘భారీ సర్వీస్‌లు, టాప్ స్పిన్, పదునైన బ్యాక్‌హ్యాండ్ నా ప్రధాన బలాలు’.
ఇదే ఆటపై ఇప్పుడు ఆమె ప్రపంచ మహిళల టెన్నిస్‌ను శాసిస్తోంది. శనివారం అనిసిమోవాతో జరిగిన ఫైనల్లో ఆమె ఆధిక్యం ప్రదర్శించిన తీరు స్వియాటెక్ పదునును చూపించింది. క్రీడాకారులు, ఒలింపిక్స్‌లో పాల్గొన్న రోయర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో తొలి అడుగులు వేసిన ఆమె ఇప్పుడు అసాధారణ ప్రదర్శనతో శిఖరానికి చేరింది. ఆమె ప్రొఫెషనల్ కెరీర్‌లో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. తొలిసారి 903వ ర్యాంక్‌తో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అడుగు పెట్టిన ఆమె మూడేళ్ల పాటు చెప్పుకోదగ్గ విజయాలతో దూసుకుపోయింది.
స్వియాటెక్ కెరీర్‌లో మూడేళ్లు 2022, 2023, 2024 అద్భుతంగా సాగాయి. తొలి సారి వరల్డ్ నంబర్‌వన్‌గా నిలవడంతో పాటు మూడు సీజన్ల పాటు ఆమె దానిని నిలబెట్టుకోవడం విశేషం. ఐదేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు క్లే కోర్టు ఫ్రెంచ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచినా గ్రాస్ మాత్రం ఆమెకు కొరుకుడు పడలేదు. ఈ సారి విజేతగా నిలవడానికి ముందు ఆమె అత్యుత్తమ ప్రదర్శన క్వార్టర్ ఫైనల్ మాత్రమే.
గత ఏడాదైతే మూడో రౌండ్‌లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత నవంబరులో డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో కొత్త వివాదం రేగింది. సస్పెన్షన్ ముగిసి మళ్లీ బరిలోకి దిగిన తర్వాత 2025లో కూడా ఆమె ప్రదర్శన గొప్పగా లేదు. రెండు గ్రాండ్‌స్లామ్‌లు ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్‌లలో ఇగా సెమీఫైనల్‌కే పరిమితమైంది. అయితే గ్రాస్‌కోర్టులో ప్రాక్టీస్‌ను తొందరగా మొదలు పెట్టేందుకు ఇది ఉపకరించింది.
వింబుల్డన్‌కు ముందు సన్నాహక గ్రాస్ కోర్టు టోర్నీ బాడ్ హాంబర్గ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరడంతో కాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు దానినే కొనసాగిస్తూ పచ్చికపై తన చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. హార్డ్ కోర్ట్‌పై యూఎస్ ఓపెన్ నెగ్గగా...ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రమే ఇంకా అందుకోవాల్సి వచ్చింది. ఇదే ఫామ్ కొనసాగితే 2026లోనే అది సాధ్యం కావచ్చు.