 
													బ్రిటన్‌రాజు కింగ్ చార్లెస్ III తన సోదరుడు ప్రిన్స్ ఆండ్రూకి భారీ షాకిచ్చారు. రాయల్ టైటిల్స్‌ను వదులుకోవడంతో పాటు తక్షణమే అధికారిక మహల్ ఖాళీ చేయాలని ఆదేశించారు. అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలలో బ్రిటన్ యువరాజు ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా ఇటీవల బయటకువచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కింగ్ చార్లెస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
డ్యూక్ ఆఫ్ యార్క్ సహా అన్ని రాచరిక హక్కులను, ఆ హోదాల్లో అన్ని రకాల వసతులను వదులుకోవడంతో పాటు 30 గదుల విండ్‌సోర్ రెసిడెన్సీని ఖాళీ చేయాలని బ్రిటన్‌రాజు కింగ్ చార్లెస్ III తన సోదరుడు ప్రిన్స్ ఆండ్రూని ఆదేశించారు. ఈ మేరకు బకింగ్‌హమ్ ప్యాలెస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆండ్రూ ఈ ఆరోపణలను తిరస్కరించినా.. ఈ చర్యలు నైతికంగా అవసరమైనవేనని బ్రిటన్ బకింగ్‌హమ్ ప్యాలెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంలో బాధితులకు రాజు చార్లెస్, రాణి కామిల్లా మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపింది.
విర్జీనియా జియూఫ్రే అనే మహిళ 17 ఏళ్ల వయసులో తనపై ప్రిన్స్ ఆండ్రూ లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ 2022లో పౌర న్యాయస్థానంలో కేసు వేశారు. అయితే.. ఆమెతో అనైతిక ఒప్పందం కుదుర్చుకుని ఆ కేసును ఆయన ముగించారు. ఆ సమయంలో ఆమెను అసలు తాను ఎన్నడూ కలవలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈలోపు..
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రిన్స్‌ఆండ్రూ పేరు రావడం సంచలనంగా మారి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ వెంటనే తన అన్న.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఒత్తిడి మేరకు ప్రిన్స్ ఆండ్రూ తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ను వదులుకునేందుకు సిద్ధపడ్డారనే ప్రచారమూ జరిగింది. దానికి కొనసాగింపుగా తన బిరుదును, తనకు లభించే గౌరవాలను ఉపయోగించనంటూ ప్రిన్స్ ఆండ్రూ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 27వ తేదీన లిచ్‌ఫీల్డ్ క్యాథడ్రల్ వద్ద రాజు చార్లెస్‌ను ఒక వ్యక్తి ప్రశ్నిస్తూ.. ఆండ్రూ-ఎప్‌స్టీన్ సంబంధాల గురించి ఎంతకాలంగా తెలుసు?” అని నిలదీశాడు. పోలీసులకు ఆండ్రూ విషయంలో కవర్‌అప్ చేయమని చెప్పారా? అని కూడా ప్రశ్నించాడు. అయితే చార్లెస్ అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది.
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం కేసు పత్రాలలో దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ సహా దాదాపు 200 మంది ధనవంతులు, శక్తిమంతుల పేర్లు ఉన్నాయి. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో.. ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రిన్స్ ఆండ్రూపైనా సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్ వెళ్లినప్పుడు ఎప్‌స్టీన్ నివాసంలో ఓ గ్రూప్ ఫొటో దిగామని, అప్పుడు ప్రిన్స్ తనని అసభ్యంగా తాకాడని పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో క్లింటన్, ట్రంప్ పేర్లను కూడా ఆమె ప్రస్తావించడం గమనార్హం.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
