
సియోల్: ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ తన ఖాతాలో మరో టైటిల్ జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన కొరియా ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో స్వియాటెక్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ స్వియాటెక్ 1–6, 7–6 (7/3), 7–5తో రెండో సీడ్ ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై గెలిచింది. స్వియాటెక్ కెరీర్‌లో ఇది 25వ సింగిల్స్ టైటిల్‌కాగా... ఈ ఏడాది మూడో టైటిల్.
2 గంటల 41 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో స్వియాటెక్‌కు గట్టిపోటీ ఎదురైంది. కేవలం రెండు ఏస్‌లు సంధించిన స్వియాటెక్ ఏకంగా తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయిన ఈ పోలాండ్ స్టార్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 1,64,000 డాలర్ల (రూ. 1 కోటీ 44 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.