
సిన్సినాటి (ఒహాయో): ఎట్టకేలకు ఏడో ప్రయత్నంలో పోలాండ్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో తన లక్ష్యాన్ని చేరుకుంది. గతంలో ఆరుసార్లు ఈ టోర్నీలో ఆడిన స్వియాటెక్ సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది.
అయితే ఏడో ప్రయత్నంలో మాత్రం స్వియాటెక్ చాంపియన్‌గా అవతరించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వియాటెక్ 7–5, 6–4తో ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలిచింది.
1 గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ తుదిపోరులో స్వియాటెక్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్వియాటెక్ కెరీర్‌లో ఇది 24వ సింగిల్స్ టైటిల్‌కాగా... ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్ తర్వాత రెండోది.
విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 7,52,275 డాలర్ల (రూ. 6 కోట్ల 54 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు, రన్నరప్ పావోలినికి 3,91,600 డాలర్ల (రూ. 3 కోట్ల 40 లక్షలు ) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
విజేత అల్‌కరాజ్
సిన్సినాటి ఓపెన్ ఏటీపీ–1000 టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్‌కరాజ్ విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్‌కరాజ్ 5–0తో గెలిచాడు. తొలి సెట్‌లో 0–5తో వెనుకబడిన దశలో అనారోగ్యం కారణంగా సినెర్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు.
ఇక టైటిల్ నెగ్గిన అల్‌కరాజ్‌కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సినెర్‌కు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈ ఏడాది అల్‌కరాజ్‌కిది ఆరో టైటిల్‌కాగా, కెరీర్‌లో 22వది కావడం విశేషం.
ఒకే విమానంలో..
ఇదిలా ఉంటే.. సిన్సినాటి ఓపెనర్ టైటిల్స్ గెలిచిన తర్వాత స్వియాటెక్, అల్‌కరాజ్ కలిసి ఒకే విమానంలో న్యూయార్క్‌కు బయలుదేరారు. యూఎస్ ఓపెన్‌లో విజేతలుగా నిలవడమే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టారు. వీరిద్దరు ఒకే విమానంలో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Iga Swiatek and Carlos Alcaraz sharing a plane to New York. 🗽
Cincinnati champions ready for the US Open.
Love this. ❤pic.twitter.com/nLD6KMnHJd— The Tennis Letter (@TheTennisLetter) August 19, 2025