
న్యూఢిల్లీ: బిల్లీజీన్ కింగ్ కప్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీ ప్లే ఆఫ్స్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. తెలంగాణకు చెందిన సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రషి్మక జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సహజ 347వ స్థానంలో నిలిచి భారత నంబర్‌వన్ ర్యాంకర్‌గా... రషి్మక 374వ స్థానంలో నిలిచి భారత రెండో ర్యాంకర్‌గా ఉన్నారు. సహజ,రష్మికాలతోపాటు అంకిత రైనా (447వ ర్యాంక్), రియా భాటియా (499వ ర్యాంక్), ప్రార్థన తొంబారేలను జట్టులోకి ఎంపిక చేశారు.
డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రార్థన 131వ స్థానంలో నిలిచిన భారత డబుల్స్ నంబర్‌వన్‌గా ఉంది. వైదేహి చౌధరీని రిజర్వ్ ప్లేయర్‌గా... జీల్ దేశాయ్, శ్రుతి అహ్లావత్‌లను ట్రెయినింగ్ క్యాంప్‌నకు ఎంపిక చేశారు. విశాల్ ఉప్పల్ నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌గా, రాధిక కనిత్కర్ కోచ్‌గా వ్యవహరిస్తారు. బిల్లీ జీన్ కింగ్ కప్ క్వాలిఫయర్స్ నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు బెంగళూరులో జరుగుతాయి. గ్రూప్ ‘జి’లో స్లొవేనియా, నెదర్లాండ్స్‌లతో భారత్ పోటీపడనుంది. గ్రూప్ ‘జి’ విజేత 2026 క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తుంది. మిగిలిన రెండు జట్లు వచ్చే ఏడాది గ్రూప్–1లో పోటీపడతాయి.