
సాక్షి, హైదరాబాద్: జింగ్‌షాన్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. చైనాలో ఈ టోర్నీ జరుగుతోంది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రిత్విక్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 6–4తో ఒమర్ జసికా (ఆ్రస్టేలియా)–డెనిస్ యెవ్‌సెయెవ్ (కజకిస్తాన్) జోడీపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్ చేరింది.
66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఏడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సర్వీస్‌లో 36 పాయింట్లకుగాను 28... రెండో సర్వీస్‌లో 18 పాయింట్లకుగాను 11 పాయింట్లు సాధించింది. మరోవైపు ఇదే టోర్నీలో హైదరాబాద్‌కే చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రీసీ స్టాల్డర్ (అమెరికా) ద్వయం కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్‌లో అనిరుధ్–స్టాల్డర్ జోడీ 1–6, 7–6 (7/3), 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో లియామ్ డ్రాక్సెల్ (కెనడా)–ఇలియట్ స్పిజిరి (అమెరికా) జంటను ఓడించింది.