
సాక్షి, హైదరాబాద్: జింగ్‌షాన్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో అనిరుధ్ చంద్రశేఖర్ జంట టైటిల్ చేజిక్కించుకుంది. చైనా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రిసీ స్టాల్డర్ (అమెరికా) జంట విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో అనిరు«ద్–రిసీ స్టాల్డర్ జోడీ 6–2, 2–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో సుంగ్ హావో హువాంగ్ (చైనీస్ తైపీ)–యుసింగ్ పార్క్ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో అనిరుధ్ జంట 2 ఏస్‌లు సంధించి... 3 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్‌ను సునాయాసంగానే నెగ్గిన అనిరు«ద్–స్టాల్డర్ జోడీకి రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఇక ఉత్కంఠభరితంగా సాగిన నిర్ణయాత్మక మూడో సెట్ ‘సూపర్ టైబ్రేక్’కు చేరగా... ఒత్తిడిని అధిగమించి కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన భారత జంట విజేతగా నిలిచింది. 67 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో 2 బ్రేక్ పాయింట్లు సాధించిన అనిరు«ద్–స్టాల్డర్ జోడీ... మొత్తం 49 పాయింట్లు నెగ్గింది. తమ సర్వీస్‌లో 34 పాయింట్లు సాధించి ముందంజ వేసింది.