48 ఏళ్ల తర్వాత చిక్కిన  ప్రేమ పావురం | Colaba Police Arrest 71-Year-Old Fugitive After 48 Years | Sakshi
Sakshi News home page

48 ఏళ్ల తర్వాత చిక్కిన  ప్రేమ పావురం

Oct 19 2025 6:09 AM | Updated on Oct 19 2025 6:09 AM

Colaba Police Arrest 71-Year-Old Fugitive After 48 Years

తాతా! ఈ జన్మకి టైం కుదిరింది! కోర్టుకి రా!

ప్రియురాలిని పొడిచిన కేసులో పట్టుబడ్డ పెద్దాయన

బెయిల్‌పై దర్జాగా వెళ్లిపోయిన 81 ఏళ్ల నిందితుడు

నానమ్మ కాలం నాటి కేసుకి మోక్షం

ఏదో చిన్నచితకా కేసు కాదు.. ఏకంగా తన ప్రేయసిని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించిన కేసు! మన హీరో చంద్రశేఖర్‌ మధుకర్‌ కాలేకర్‌.. ఈ సాహసం చేసింది 1977లో. అప్పుడు ఆయ న వయసు కేవలం 23 ఏళ్లే. రక్తంలో ప్రేమ, అపనమ్మకం, యవ్వనం.. అన్నీ ఉప్పొంగుతున్న సమయం. ఈ లవర్‌ బాయ్‌కి.. తన లవర్‌ క్యారెక్టర్‌పై తెగ అనుమానం వచ్చేసింది. 

అంతే.. కోపంతో ఊగిపోయాడు.. ముంబైలోని కొలాబాలో ప్రియురాలిపై కత్తి దూశాడు. పాపం ఆ రోజుల్లోనే ఇంత కసితో ప్రేమించిన మొనగాడున్నాడంటే.. మామూ లు విషయం కాదు!. కుర్రాడిని ఎలాగోలా పోలీసులు పట్టేసుకున్నారు, కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అంతే! ఆ బెయిల్‌ పత్రాన్ని అందుకున్నారో లేదో, మన కాలేకర్‌ గారు ‘ట్రయల్‌ బై ఎస్కేప్‌’ అనే కొత్త రూల్‌ కనిపెట్టి, మాయమైపోయారు. 

దాదాపు ఐదు దశాబ్దాలు (48 ఏళ్లు) ఎక్కడా కనిపించకుండా, దొరక్కుండా, సన్యాసిలా జీవితం గడిపారు! కోర్టు విచారణ లేకుండా 48 ఏళ్లు బతికారంటే.. తన జీవితంపై ఆయనకు ఎంత నమ్మకమో కదా!. ముంబై పోలీసులు పాపం చాలా వెతికారు. అడ్రస్‌ మారడం, ఆ నివసించిన భవనం కూల్చేయడం... ఇలా సకల కారణాల వల్ల అతన్ని పట్టుకోలేకపోయారు. కోర్టు నాన్‌ – బెయిలబుల్‌ వారెంట్‌ ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇక కేసు మూలనపడింది అనుకుంటున్న టైమ్‌లో.. మిరాకిల్‌!

దొరికిపోయాడోచ్‌.. 
తాజాగా దర్యాప్తు మొదలుపెట్టిన కొలాబా పోలీసులు, ఈ పాత కేసు ఫైల్‌ని దుమ్ము దులుపుతుండగా.. ఓ చిన్న క్లూ దొరికింది. అదేంటంటే.. 2015లో రత్నగిరి జిల్లాలోని దాపోలి పోలీస్‌ స్టేషన్‌లో ఓ ప్రమాదం కేసులో కాలేకర్‌ పేరు నమోదైంది! అంటే, పారిపోయి ప్రశాంతంగా ఉన్నా, ప్రమాదం రూపంలో కర్మ ఆయనను వెతుక్కుంటూ వచ్చింది! ఆ దెబ్బతో, పోలీసులు వెతికి పట్టుకున్నారు. 

పోలీసు అంకుల్స్‌కి హ్యాట్సాఫ్‌!.
48 ఏళ్ల క్రితం 23 ఏళ్ల యువకుడిని.. ఇప్పుడు గుర్తు పట్టడం అంటే మాటలా? అంతా సవాలే. కానీ పాత ఫొటోలు చూసి, ఇంటరాగేషన్‌ చేయగా.. మన 81 ఏళ్ల తాతగారు తప్పనిసరి పరిస్థితుల్లో తన తప్పును ఒప్పుకున్నారు! ఇంతకాలం గుర్తు పెట్టుకుని ఉండాలంటే.. ఎంత ఘోరమైన అటాక్‌ అయి ఉంటుందో!.

ఇప్పటికింకా ఈయన వయసు నిండా 81 ఏళ్లే..
కోర్టులో అడ్వకేట్‌ సునీల్‌ పాండే ఆయన తరపున వాదించారు. ‘సార్‌! నా క్లయింట్‌ వయసు 81 ఏళ్లు, బోలెడన్ని వ్యాధులు ఉన్నాయి. అసలు చార్జిషీట్‌ ఫైల్‌ చేశాక నోటీస్‌ ఇవ్వలేదు! 2010లో ఆయన గుడిసె పడిపోయింది, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరారు.. అందుకే కోర్టుకు రాలేకపో యారు’.. అంటూ 48 ఏళ్ల తప్పిదానికి సరదాగా కవర్‌ డ్రైవ్‌ ఇచ్చారు!

జాలి పడ్డ జడ్జి గారు!
ప్రభుత్వ తరపు న్యాయవాది ఆనంద్‌ సుఖదేవే గారు మాత్రం ‘అయ్యో! ఇదో పెద్ద నేరం, 48 ఏళ్లు ట్రయల్‌ని ఆలస్యం చేసింది ఈయనే! మళ్లీ పారిపోవచ్చు!’ అని గట్టిగా అభ్యంతరం చెప్పారు. కానీ, న్యాయమూర్తి అవినాష్‌ పి.కులకర్ణి గారు.. మన తాతగారి వయసు, ఆయన ‘కచ్చితంగా కోర్టుకు వస్తాను’ అని ఇచ్చిన హామీని చూసి జాలి పడ్డారు. చివరికి, బెయిల్‌ మంజూరు చేసేశారు! 
 

తాతగారు హ్యాపీస్‌..
ప్రేమించి, పొడిచి, పారిపో యి... వయసు మీరి పట్టుబడిన చంద్రశేఖర్‌ మధుకర్‌ కాలేకర్‌ గారు, ఇప్పుడు బెయిల్‌పై దర్జాగా ఉన్నారు. 48 ఏళ్ల తర్వాత.. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆయనపై విచారణ మొదలవుతుంది! ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఆ రోజుల నాటి పోలీసులు, సాక్షులు ఎవరైనా బతికి ఉన్నారో లేదో?, అసలు ఆ ప్రేయసి ఏమైందో.. దేవుడికే తెలియాలి! ఇంతకాలం ఈ కేసును ఫైల్లోంచి తీయకుండా ఉంచిన ఆ న్యాయస్థానం సిబ్బందికి మాత్రం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో మంచి స్థానం దక్కుతుంది! మరి, ఈ ట్రయల్‌ ఇంకో 48 ఏళ్లు సాగకుండా ఉంటుందా? మీరేమంటారు?

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement