
రూ. 12 లక్షలతో స్మాషర్స్ కొనుగోలు
బోపన్న జట్టులో శ్రీవల్లి
టీపీఎల్ వేలం
ముంబై: తెలంగాణ ఆటగాడు రిత్విక్ బొల్లిపల్లి చెన్నై స్మాషర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. వేలంలో చెన్నై ఫ్రాంచైజీ అతని కోసం పోటీపడిమరీ దక్కించుకుంది. టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) ఏడో సీజన్ కోసం గురువారం ఆటగాళ్ల వేలాన్ని నిర్వహించారు. భారత టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలు వేలంలో సందడి చేశారు. గురువారం అత్యధిక మొత్తం లభించిన ఇద్దరు ఆటగాళ్లలో తెలంగాణ టెన్నిస్ ప్లేయర్ రిత్విక్, శ్రీరామ్ బాలాజీ ఉన్నారు.
రూ. 12 లక్షలతో రిత్విక్‌ను స్మాషర్స్ కొనుగోలు చేయగా, అంతే మొత్తంతో శ్రీరామ్ బాలాజీని గుర్‌గావ్ గ్రాండ్ స్లామర్స్ చేజిక్కించుకుంది. తెలంగాణ మహిళా ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లిని రోహన్ బోపన్న నేతృత్వంలోని ఎస్‌జీ పైపర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఇటీవల జరిగిన బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 పోరులో శ్రీవల్లి ఆకట్టుకోవడంతో బెంగళూరు ఆమె కోసం రూ.8.60 లక్షలు వెచి్చంచింది. రామ్‌కుమార్ రామనాథన్ కంటే కూడా శ్రీవల్లికే ఎక్కువ మొత్తం లభించింది.
బెంగళూరు రామ్‌కుమార్‌ను రూ. 7.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఎస్‌జీ పైపర్స్ జట్టు సీఈఓ అయిన మహేశ్ భూపతి మాట్లాడుతూ తమ బెంగళూరు జట్టు అనుభవజ్ఞులు యువ ఆటగాళ్ల మేలవింపుతో పటిష్టంగా ఉందని అన్నాడు. ‘ఈ సీజన్‌లో జట్టు కూర్పు పట్ల సంతోషంగా ఉన్నాం. రోహన్ బోపన్న, శ్రీవల్లి, రామ్‌కుమార్ లాంటి మేటి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. ఈ సీజన్‌లో వీరంతా తప్పకుండా రాణిస్తారు’ అని భూపతి ఆశాభావం వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ స్ట్రయికర్స్ తెలుగు ఆటగాడు విష్ణువర్ధన్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది.
అతన్ని రూ. 6 లక్షలకు దక్కించుకోగా... ఫ్రాన్స్ స్టార్ కారోల్ మోనెట్‌ను రూ. 10.60 లక్షలకు కొనుగోలు చేసింది. జీఎస్ ఢిల్లీ ఏసెస్ ఫ్రాంచైజీ బెల్జియంకు చెందిన సోఫియా కొస్టాలస్‌ను రూ. 11 లక్షలకు, డబుల్స్ స్పెషలిస్టు జీవన్ నెదున్‌జెళియాన్‌ను రూ. 6 లక్షలకు కొనుక్కుంది. యశ్ ముంబై ఈగల్స్ జట్టు మరియం బొల్కవద్జె (జార్జియా), నిక్కీ పూనచలను చెరో రూ. 6 లక్షలతో దక్కించుకుంది. టీపీఎల్ ఏడో సీజన్ పోరు డిసెంబర్ 9న మొదలై 14న జరిగే ఫైనల్‌తో ముగియనుంది.