
ఫైనల్లో అనిసిమోవాపై ఘన విజయం
6–0, 6–0తో అమెరికా ప్లేయర్ చిత్తు
కెరీర్‌లో ఆరో గ్రాండ్‌స్లామ్ సాధించిన పోలండ్ స్టార్
లండన్: పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ అసాధారణ ఆటతో వింబుల్డన్‌లో విజయకేతనం ఎగురవేసింది. గ్రాస్ కోర్టుపై తిరుగులేని ప్రదర్శన కనబర్చిన ఇగా 2025 వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచింది. శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ స్వియాటెక్ 6–0, 6–0తో 13వ సీడ్ అమందా అనిసిమోవా (అమెరికా)ను చిత్తు చిత్తుగా ఓడించింది.
కేవలం 57 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో స్వియాటెక్ ముందు అమందా ఏమాత్రం నిలవలేకపోయింది. స్వియాటెక్ కెరీర్‌లో ఇది తొలి వింబుల్డన్ టైటిల్ కాగా...ఓవరాల్‌గా ఇది ఆరో గ్రాండ్‌స్లామ్. ఈ గెలుపుతో మూడు సర్ఫేస్ (హార్డ్, క్లే, గ్రాస్)లలోనూ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన ప్లేయర్‌గా స్వియాటెక్ గుర్తింపు పొందింది. నాలుగు ఫ్రెంచ్ ఓపెన్‌లు, ఒక యూఎస్ ఓపెన్ ట్రోఫీ నెగ్గిన పోలండ్ స్టార్ కెరీర్‌లో ఇక ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రమే మిగిలి ఉంది.
ఫటాఫట్...
మ్యాచ్‌కు ముందు మాజీ వరల్డ్ నంబర్‌వన్ స్వియాటెక్‌పై సహజంగానే గెలుపు అంచనాలు ఉన్నాయి. అయితే సెమీస్‌లో వరల్డ్ నంబర్‌వన్ సబలెంకాపై సంచలన విజయం సాధించిన అనిసిమోవా గట్టి పోటీనిస్తుందని అంతా భావించారు. అయితే పోలండ్ స్టార్ ముందు అమెరికన్ ప్లేయర్ ఆటలు ఏమాత్రం సాగలేదు.
తొలి సెట్‌లో ఏకంగా 14 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసిన అనిసిమోవా...రెండో సెట్‌లోనూ మరో 14 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో ప్రత్యరి్థకి మ్యాచ్‌ను అప్పగించింది. తొలి ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి అమెరికన్‌లో కనిపించగా...స్వియాటెక్ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది.
3 ఏస్‌లు సంధించిన పోలండ్ ప్లేయర్ ప్రత్యర్థి సర్వీస్‌ను 6 సార్లు బ్రేక్ చేసింది. ఆరో గ్రాండ్‌స్లామ్‌తో ఇగా విజయగర్జన చేయగా... ఓటమి అనంతరం అనిసిమోవా కన్నీళ్లపర్యంతమైంది. 2018లో స్వియాటెక్ బాలికల సింగిల్స్‌లో వింబుల్డన్ టైటిల్ నెగ్గింది.
6 స్వియాటెక్ కెరీర్‌లో ఇది ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్
100 గ్రాండ్‌స్లామ్‌లో స్వియాటెక్‌కు ఇది వందో విజయం. 2019లో తొలి సారి బరిలోకి దిగిన ఆమె 120 మ్యాచ్‌లలో 100 గెలిచింది.
114 వింబుల్డన్ ఫైనల్ ఇలా 6–0, 6–0 (డబుల్ బీగెల్)తో ముగియడం 114 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1911 వింబుల్డన్ ఫైనల్లో డొరొతియా లాంబర్ట్ 6–0, 6–0తో డొరా బుత్‌బైని ఓడించింది. 1988 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో స్టెఫీగ్రాఫ్ 6–0, 6–0తో నటాషా జ్వెరెవాను చిత్తు చేసింది.
నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్
అల్‌కరాజ్ (స్పెయిన్) X సినెర్ (ఇటలీ)
రాత్రి గం. 8:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం