టీ20 ప్రపంచకప్-2026కు ముందు అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఆరోన్ జోన్స్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) సస్పెన్షన్ వేటు వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
బార్బడోస్ వేదికగా జరిగిన బిమ్ టీ10 టోర్నమెంట్-2024 సీజన్‌లో జోన్స్ మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడని ఐసీసీ విచారణలో ప్రాథమికంగా తేలింది. ఈ క్రమంలోనే అతడు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లలో ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది.
తనపై వస్తున్న ఆరోపణలపై 14 రోజుల సమాధానమివ్వాలని అతడిని ఐసీసీ ఆదేశించింది. ఆరోన్ జోన్స్‌పై మొత్తం ఐదు అభియోగాలు నమోదయ్యాయి. వీటిలో మూడు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పరిధిలోకి రాగా, మిగిలిన రెండు ఐసీసీ రిజిస్టర్ చేసింది. ఈ లీగ్‌లో ఆడే సమయంలో జోన్స్‌ను బుకీలు సంప్రదించగా.. అతడు ఆ వివరాలను అధికారులకు తెలియజేయలేదు.
ఈ కారణంతో ఐసీసీ వేటు వేసింది. అమెరికా జట్టులో జోన్స్ రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా సూపర్-8 చేరడంలో ఆరోన్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా పాకిస్తాన్‌పై అమెరికా సాధించిన చారిత్రాత్మక విజయంలో అతడి ఇన్నింగ్స్ మరువలేనిది.
అటువంటి ఆటగాడు ఇప్పుడు తనంతంట తానే కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్నాడు. ఈ సస్పెన్షన్ కారణంగా రాబోయే 2026 టీ20 ప్రపంచ కప్‌లో జోన్స్ ఆడే అవకాశం కోల్పోయాడు. జోన్స్ ఇప్పటివరకు అమెరికా తరపున 52 వన్డేలు, 48 టీ20లు ఆడాడు.
చదవండి: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే: సూర్యకుమార్


