
రెండో ర్యాంకర్ స్వియాటెక్‌పై వరుస సెట్‌లలో విజయం
వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం
ఫైనల్లో చోటు కోసం ఒసాకాతో పోరు
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో అమెరికా స్టార్, ఎనిమిదో సీడ్ అమండ అనిసిమోవా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా 6–4, 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను ఓడించిది. ఈ గెలుపుతో... గత జూలై 12న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో ఒక్క గేమ్ కూడా నెగ్గకుండా 0–6, 0–6తో స్వియాటెక్ చేతిలో ఎదురైన దారుణ ఓటమికి అనిసిమోవా బదులు తీర్చుకుంది.
‘వింబుల్డన్ ఫైనల్లో ఘోర పరాజయం తర్వాత పుంజుకొని స్వియాటెక్‌పై నెగ్గడం నాకెంతో ప్రత్యేకం. ఆ ఓటమి నుంచి తేరుకోవడానికి నేను చాలా శ్రమించాను. నా కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు లభించినందుకు ఆనందంగా ఉంది’ అని తొలిసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన అనిసిమోవా వ్యాఖ్యానించింది. స్వియాటెక్‌తో 96 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనిసిమోవా మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, స్వియాటెక్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.
23 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా 12 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ మూడు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 15 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఫైనల్లో చోటు కోసం నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నయోమి ఒసాకా (జపాన్)తో అనిసిమోవా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 23వ సీడ్ ఒసాకా 6–4, 7–6 (7/3)తో 11వ ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది.
సినెర్ దూకుడు
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఇటలీకే చెందిన 10వ సీడ్ ముసెట్టితో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–1, 6–4, 6–2తో నెగ్గాడు. సినెర్ పది ఏస్‌లు సంధించడంతోపాటు ముసెట్టి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో 25వ సీడ్ ఫెలిక్స్ (కెనడా) 4–6, 7–6 (9/7), 7–5, 7–6 (7/4)తో ఎనిమిదో సీడ్ డిమినార్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు.