
వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టైటిల్ నెగ్గిన అమెరికా స్టార్
ఫైనల్లో అమెరికాకే చెందిన జెస్సికా పెగూలాపై విజయం
అవుహాన్ (చైనా): ఆద్యంతం నిలకడగా రాణించిన అమెరికా టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ ఈ ఏడాది తన ఖాతాలో రెండో టైటిల్‌ను జమ చేసుకుంది. ఈ సీజన్‌లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన కోకో గాఫ్... ఆదివారం ముగిసిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. అమెరికాకే చెందిన ప్రపంచ 6వ ర్యాంకర్ జెస్సికా పెగూలాతో జరిగిన తుది పోరులో కోకో గాఫ్ 6–4, 7–5తో గెలుపొందింది.
1 గంట 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కోకో నాలుగు ఏస్‌లు సంధించి, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన కోకో గాఫ్‌కు 5,96,000 డాలర్ల (రూ. 5 కోట్ల 28 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
2 చైనా ఆతిథ్యమిస్తున్న రెండు డబ్ల్యూటీఏ– 1000 టోర్నీల్లో (బీజింగ్ ఓపెన్, వుహాన్ ఓపెన్) విజేతగా నిలిచిన రెండో ప్లేయర్ కోకో గాఫ్. గతంలో ఫ్రాన్స్ ప్లేయర్ కరోలినా గార్సియా (2017లో) మాత్రమే ఈ ఘనత సాధించింది.
9 హార్డ్ కోర్టులపై తాను ఆడిన తొమ్మిది టోర్నీల ఫైనల్స్‌లోనూ కోకో గాఫ్ చాంపియన్ కావడం విశేషం.