సంచలనాల మోత.. టాప్‌ సీడ్‌లకు ఊహించని షాకులు | Wimbledon 2025: Paolini Knocked Out, Djokovic Enters 3rd Round | Sakshi
Sakshi News home page

వింబుల్డన్‌లో సంచలనాల మోత.. టాప్‌ సీడ్‌లకు ఊహించని షాకులు

Jul 4 2025 1:24 PM | Updated on Jul 4 2025 1:39 PM

Wimbledon 2025: Paolini Knocked Out, Djokovic Enters 3rd Round

టెన్నిస్‌ సీజన్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ వింబుల్డన్‌లో ఈ ఏడాది సంచలనాల మోత కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ ఫేవరెట్స్‌ అనూహ్య పరాజయాలతో ఇంటిదారి పడుతున్నారు. 

ఇప్పటికే రెండో సీడ్‌ కోకో గాఫ్, మూడో సీడ్‌ జెస్సికా పెగూలా, ఐదో సీడ్‌ కిన్‌వెన్‌ జెంగ్, తొమ్మిదో సీడ్‌ పౌలా బదోసా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... తాజాగా వీరి సరసన గత ఏడాది రన్నరప్, నాలుగో సీడ్‌ జాస్మిన్‌ పావోలిని చేరింది. 

రష్యాకు చెందిన ప్రపంచ 80వ ర్యాంకర్, అన్‌సీడెడ్‌ కామిలా రఖిమోవా అద్భుత ఆటతో పావోలిని ఆట కట్టించి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌), మాజీ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా (జపాన్‌) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.  

లండన్‌: గత ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌కు గెలుపు దూరంలో ఉండిపోయిన ఇటలీ టెన్నిస్‌ స్టార్‌ జాస్మిన్‌ పావోలినికి ఈ సీజన్‌ కలిసి రావడం లేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌లో వెనుదిరిగిన పావోలిని... ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌లో ఓడిపోగా... తాజాగా వింబుల్డన్‌ టోర్నీలో రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. రష్యాకు చెందిన అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి, ప్రపంచ 80వ ర్యాంకర్‌ కామిలా రఖిమోవా 4–6, 6–4, 6–4తో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్‌ పావోలినిపై సంచలన విజయం సాధించింది.

తద్వారా తన కెరీర్‌లో మూడోసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరుకుంది. గత ఏడాది ఫ్రెంచ్‌ఓపెన్‌ ఫైనల్లో స్వియాటెక్‌ చేతిలో... వింబుల్డన్‌ టోర్నీ ఫైనల్లో క్రెజికోవా చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన పావోలిని ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. 

రఖిమోవాతోజరిగిన పోరులో తొలి సెట్‌ను నెగ్గిన పావోలిని ఆ తర్వాత తడబడింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పావోలిని 40 అనవసర తప్పిదాలు చేసి, 23 విన్నర్స్‌ కొట్టింది. తన సరీ్వస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. రఖిమోవా 26 విన్నర్స్‌ కొట్టింది. నెట్‌ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది.  

స్వియాటెక్‌ ముందంజ... 
మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌), మాజీ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా (జపాన్‌), ఏడో సీడ్‌ మిరా ఆంద్రీవా (రష్యా), ఎనిమిదో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌), మాజీ చాంపియన్‌ రిబాకినా (కజకిస్తాన్‌), పదో సీడ్‌ ఎమ్మా నవారో (అమెరికా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. 

రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో క్రెజికోవా 6–4, 3–6, 6–2తో డొలెహిడి (అమెరికా)పై, ఒసాకా 6–3, 6–2తో సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, ఆంద్రీవా 6–1, 7–6 (7/4)తో బ్రాన్‌జెట్టి (ఇటలీ)పై, రిబాకినా 6–3, 6–1తో సాకరి (గ్రీస్‌)పై, నవారో 6–1, 6–2తో కుదెర్మెటోవా (రష్యా)పై, స్వియాటెక్‌ 5–7, 6–2, 6–1తో కేటీ మెక్‌నాలీ (అమెరికా)పై గెలిచారు.  

బాలాజీ జోడీ బోణీ 
పురుషుల డబుల్స్‌ విభాగంలో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–వరేలా (మెక్సికో) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో బాలాజీ–వరేలా ద్వయం 6–4, 6–4 తో లెర్నర్‌ టియెన్‌–కొవాసెవిక్‌ (అమెరికా) జంటను ఓడించింది.  

జొకోవిచ్‌... వరుసగా 16వసారి 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఏడుసార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ వరుసగా 16వ సారి వింబుల్డన్‌ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. గత ఆరు పర్యాయాల్లో ఫైనల్‌ చేరిన జొకోవిచ్‌... గురువారం జరిగిన రెండో రౌండ్‌లో అలవోకగా గెలిచాడు. 1 గంటా 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ 6–3, 6–2, 6–0తో డేనియల్‌ ఇవాన్స్‌ (బ్రిటన్‌)పై గెలుపొందాడు. 11 ఏస్‌లు కొట్టిన జొకోవిచ్‌ రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 26 సార్లు నెట్‌ వద్దకు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా చేజార్చుకోని జొకోవిచ్‌ ప్రత్యర్థి సర్వీస్‌స్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement