
క్వార్టర్ ఫైనల్లో క్రెజికోవాపై వరుస సెట్‌లలో విజయం
న్యూయార్క్: సొంతగడ్డపై తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా ఆ దిశగా మరో అడుగు వేసింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జెస్సికా 6–3, 6–3తో ప్రపంచ 62వ ర్యాంకర్, 2021 ఫ్రెంచ్ ఓపెన్, 2024 వింబుల్డన్ టోర్నీ విజేత బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందింది. 86 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్ జెస్సికా ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి పదిసార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు క్రెజికోవా ఏకంగా ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 24 అనవసర తప్పిదాలు చేసింది.
కోకో గాఫ్ అవుట్
మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన కోకో గాఫ్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నయోమి ఒసాకా (జపాన్) 6–3, 6–2తో 2023 చాంపియన్ కోకో గాఫ్‌ను ఓడించింది. తద్వారా 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఒసాకా మరోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–3, 6–1తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–7 (0/7), 6–2తో మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్)పై, ఎనిమిదో సీడ్ అమండ అనిసిమోవా (అమెరికా) 6–0, 6–3తో బీట్రిజ్ హదద్ మాయ (బ్రెజిల్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
సూపర్ సినెర్...
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సినెర్ కేవలం మూడు గేమ్‌లు కోల్పోయాడు. 81 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సినెర్ 6–1, 6–1, 6–1తో బుబ్లిక్‌ను ఓడించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఫెలిక్స్ అలియాసిమ్ (కెనడా) 7–5, 6–3, 6–4తో 15వ సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, పదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–0, 6–1తో మునార్ (స్పెయిన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.