‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’ | forced to sell rangerover outside NCR offering throwaway prices | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’

Jul 2 2025 2:38 PM | Updated on Jul 2 2025 3:37 PM

forced to sell rangerover outside NCR offering throwaway prices

పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించడంతో తాను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించే రేంజ్‌ రోవర్‌ను తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోందని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పాత వాహనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌(ఈఓఎల్‌) పాలసీ ప్రకారం డీజిల్‌ వాహనాల జీవితకాలాన్ని 10 ఏళ్లుగా, పెట్రోల్‌ వాహనాలకు 15 ఏళ్లుగా నిర్ణయించింది. దాంతో నిర్ణీత సమయం దగ్గర పడుతున్న వాహనాలను వాహనదారులు ఢిల్లీ ఎన్‌సీఆర్‌ వెలుపల నివసిస్తున్న వారికి విక్రయించాల్సి వస్తుంది.

రితేష్ గండోత్రా అనే వ్యక్తి తాను రూ.లక్షలుపోసి కొనుగోలు చేసిన రేంజ్‌ రోవర్‌ కారును ఢిల్లీ ఈఓఎల్‌ నిబంధనలను అనుగుణంగా చౌకగా అమ్మాల్సి వస్తుందని ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు విలువ చేసే కారును ఇలా అమ్మకాన్ని పెడుతుండడంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘నేను రేంజ్‌ రోవర్‌ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్‌. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్‌ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్‌ ఉంది. ఎన్‌సీఆర్‌లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాలకు ధన్యవాదాలు. నా కారును విక్రయించవలసి వస్తుంది. అది కూడా ఎన్‌సీఆర్‌ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే ఇవ్వాలి. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: ‘మానవుల మాదిరిగా వాస్తవాలు తెలుసుకోదు’

రితేశ్‌ పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీలో వాహనాలు కొనుగోలు చేసేందుకు ముందుగా 15 ఏళ్లపాటు రోడ్‌ ట్యాక్స్‌ కట్టించుకున్నారు. మిగతా 5 ఏళ్ల ట్యాక్స్‌ రిటర్న్‌ ఇవ్వమని అడగాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ఇంకొంకరు ‘మీరు కారు ఏ ధరకు అమ్ముతారో చెప్పండి సర్‌’ అంటూ స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement