
ఎక్కడైనా ట్యాక్సీ కోసం.. మారుతి కారునో, మహీంద్రా కారునో లేదా టాటా కారునో ఉపయోగిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన ఒక బార్బర్ ఏకంగా రూ.3.2 కోట్ల విలువైన కారును ట్యాక్సీగా అద్దెకు ఇవ్వడానికి కొనుగోలు చేశారు.
బెంగళూరుకు చెందిన రమేష్ బాబు.. టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లెక్కలేనన్ని కార్లను ఈ ఫ్లీట్‌లో చేర్చిన ఈయన.. తాజాగా 'రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యుబీ' కారును చేర్చారు. ఈ కారును డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రమేష్ బాబు టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో.. ఇప్పటికే రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ మేబాచ్, జీ వ్యాగెన్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130, బీఎండబ్ల్యు ఐ7 వంటి కార్లు చేరాయి. ఇప్పుడు తాజాగా రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యుబీ చేరింది. ఈ కారు ఫుజి వైట్ క్లాసీ షేడ్‌లో ఉన్న హెచ్ఎస్ఈ లాంగ్ వీల్‌బేస్ వేరియంట్. ఇది 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా 346 బీహెచ్పీ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

రమేష్ బాబు లగ్జరీ కార్లు
రమేష్ బాబు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కష్టాలను అధిగమించి.. నేడు మిలియనీర్ స్థాయికి ఎదిగారు. బెంగళూరులో జన్మించిన రమేష్ బాబు తండ్రి బార్బర్, అయితే తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో.. తల్లి తమను పోషించడానికి పనిమనిషిగా పనిచేసింది. ఈ క్రమంలో రమేష్ బాబు చిన్న చిన్న పనులు చేస్తూ.. పాఠశాల విద్యను పూర్తి చేసి, తండ్రికి చెందిన బార్బర్ షాప్ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులోనే మెల్లగా ఎదిగి, మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: రోజుకు 12 గంటల నిద్ర!.. ఇదే నా సక్సెస్ సీక్రెట్: టెలిగ్రామ్ సీఈఓ
మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేసిన తరువాత.. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఆలా అద్దెకు కార్లను ఇవ్వడం ద్వారా సంపాదించడం ప్రారభించి.. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రీమియం కార్ల అద్దె కంపెనీ ఏర్పాటు చేశారు. 2011లో అద్దెకు ఇవ్వడానికి రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ I కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈయన అనేక ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తున్నారు.