
స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుందని.. అందరూ నమ్ముతుంటే, ఫోన్ వాడకపోవడం వల్లే నేను సక్సెస్ సాధించా అని టెలిగ్రామ్ కో-ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov) చెబుతున్నారు. ఇంతకీ అదెలా సాధ్యమైంది?, వివరాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం.
లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ''రోజులో వీలైనంత సమయం.. సుమారు 11 నుంచి 12 గంటలు నిద్ర కోసం కేటాయించడానికి ప్రయత్నిస్తాను. అయితే అన్ని గంటలు నిద్రకోసం కేటాయించినా.. నిద్రపోను. మంచం మీద పడుకుని ఆలోచిస్తూనే ఉంటాను'' అని దురోవ్ పేర్కొన్నారు.
పడుకున్నప్పుడే.. నాకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. తాను సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఉన్నప్పటికీ.. స్మార్ట్‌ఫోన్ వాడకం చాలా తక్కువని పేర్కొన్నారు. నిద్ర లేచిన వెంటనే తన ఫోన్ చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. నోటిఫికేషన్‌లు, సోషల్ మీడియా వంటివన్నీ ఒక వ్యక్తి రోజును డిసైడ్ చేస్తాయని నమ్ముతాను.
జీవితంలో ఏది ముఖ్యమైనదో నిర్ణయించుకోవాలి. ఇతర వ్యక్తులు, కంపెనీ వంటివన్నీ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి కాదు. ప్రతి రోజూ ఉదయం ఫోన్ లేకుండానే మీ దినచర్యను ప్రారభించడం అలవాటు చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
వ్యాయామం చేసేటప్పుడు.. ఇతరత్రా పనులు చేసేటప్పుడు కూడా వీలైనంత ఫోనుకు దూరంగా ఉండాలి. ఫోన్ దూరంగా ఉన్నప్పుడే మీకు అద్భుతమైన ఆలోచనలు రావొచ్చని దురోవ్ చెబుతున్నారు. టెక్నాలజీ, కనెక్టివిటీ వంటి వాటికి మద్దతు ఇస్తున్నప్పటికీ.. జీవితంలో ఏది ముఖ్యమో దానికోసం సమయం వెచ్చించాలని ఆయన సూచించారు.