
రైలు ప్రయాణికుల సంఖ్య దినదినం పెరుగుతూనే ఉంది. ప్రయాణికులకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో.. నార్త్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్లలోని అన్ని ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ఆకతాయిల ఆగడాలు, దొంగతనాల నుంచి విముక్తి కల్పిస్తుంది.
నార్త్ సెంట్రల్ రైల్వే.. ఈ ప్రాజెక్ట్‌లో 895 లింకే హాఫ్‌మన్ బుష్, 887 ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కోచ్‌లలో (మొత్తం 1,782 కోచ్‌లు).. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్, శ్రమశక్తి ఎక్స్‌ప్రెస్‌లతో సహా ఎంపిక చేసిన ప్రీమియం రైళ్లలో AI-ఆధారిత కెమెరాలను కూడా మోహరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి దశలో.. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్, శ్రమశక్తి ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ - డా. అంబేద్కర్ నగర్ ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్-లాల్‌ఘర్ ఎక్స్‌ప్రెస్, సుబేదర్‌గంజ్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్, సుబేదర్‌గంజ్-మీరట్ సిటీ సంగమ్ ఎక్స్‌ప్రెస్, మరియు సుబేదర్‌గంజ్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా జమ్మూ మెయిల్ వంటి అనేక రైళ్లలో కెమెరాలు అమర్చుతారు.
ఇదీ చదవండి: రాకెట్‌లా దూసుకెళ్తున్న బంగారం ధరలు: మూడు కారణాలు
ప్రతి ఏసీ కోచ్‌లో నాలుగు కెమెరాలు ఉంటాయి. జనరల్ కంపార్ట్‌మెంట్లు, స్లీపర్ కోచ్‌లు, ప్యాంట్రీ కార్లలో ఆరు కెమెరాలు ఫిక్స్ చేస్తారు. సీసీటీవీ యూనిట్లు నాలుగు ఎంట్రీ పాయింట్ల వద్ద, కారిడార్లలో ఏర్పాటు చేస్తారు. ఇవి కోచ్‌ల లోపల ప్రతి కదలికను కవర్ చేస్తాయి. NCR ప్రధాన కార్యాలయంతో పాటు ఆగ్రా, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) కార్యాలయాలలో పర్యవేక్షణ జరుగుతుంది. అంతే కాకుండా లోకోమోటివ్ క్యాబిన్లలో నిఘా పరికరాలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి.