
రాంగ్ రూట్ ప్రయాణానికి భారీ మూల్యం
తరచూ అదే ప్రాంతంలో ప్రయాణం
ఈ మధ్య సోషల్ మీడియాలో బైకులపై ఉన్న చలాన్ల గురించి నడుస్తున్న చర్చ గురించి తెలిసిందే. వేలల నుంచి లక్షల దాకా చలాన్లు ఉన్న బైకుల ఫొటోలను కొందరు తరచూ వైరల్ చేస్తున్నారు. అక్కడ ఆ అవసరం లేకుండానే పోలీసులకు చిక్కాడు ఓ చలాన్ల ధీరుడు!
హైదరాబాద్: : తరచూ ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్‌రూట్లో వెళ్లడంతో ఆటోమెటిక్ సీసీ కెమెరా ద్వారా రూ.58895 జరిమానా పడినట్లు గుర్తించిన వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు సదరు వాహనాన్ని సీజ్ చేశారు. సంఘటనకు సంబందించి వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ భూపతిగట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హస్తినాపురం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు విలియంకేరికి చెందిన బైక్ నంబర్ ఏపి37డీఎస్ 3639 వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఏకంగా రూ.58895 పెండింగ్ చలాన్‌లు ఉన్నట్లు గుర్తించారు.
అతను ప్రతిరోజు గుర్రంగూడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే యూటర్న్ వద్ద రాంగ్‌రూట్లో ఒక్కోరోజు నాలుగైదు సార్లు వెళితే నాలుగైదు జరిమానాలు ఆటోమెటిక్‌గా జరిమానాలు పడినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్‌చేసిన పోలీసులు పెండింగ్ చలానాలు చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని యజమానికి సూచించారు. దీంతో అతను డబ్బులు చెల్లించి బైక్ తీసుకెళతానని చెప్పి వెళ్లినట్లు సీఐ తెలిపారు.
వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విజయవాడ, నాగార్జున జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన యూటర్న్‌ల వద్ద ట్రాఫిక్ పోలీసులు లేరనే ఉద్దేశంతో వాహనదారులు రాంగ్‌రూట్లో వెళుతున్నారు. ప్రతి యూటర్న్ వద్ద తాము ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఈ యూటర్న్ లు ఉన్న ప్రాంతంలో వాహనదారులు రోజుకు ఎన్నిసార్లు రాంగ్ రూట్లో వెళితే అన్ని సార్లు రూ. 1235 చొప్పున జరిమానా పడుతుందన్నారు. ప్రతిఒక్కరూ గమనించి రాంగ్‌రూట్లో వెళ్లవద్దని, జరిమానాలే కాకుండా ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం పోగొట్టుకునే పరిస్థితి వస్తుందని సీఐ హెచ్చరించారు.