ఔరంగాబాద్: భారతీయ రైల్వే మరో రైల్వే స్టేషన్ పేరును మార్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మారుస్తూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ నగరం పేరును మార్చిన మూడేళ్ల తరువాత సెంట్రల్ రైల్వే.. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును అధికారికంగా ‘ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్’గా మార్చింది. ఈ కొత్త స్టేషన్‌కు కోడ్ ‘సీపీఎస్‌ఎన్’ అని సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ కిందకు వస్తుంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ఇటీవల ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని నాటి ప్రభుత్వం ఔరంగాబాద్ నగరం పేరును అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు నివాళిగా నగరం పేరును మార్చారు.
రైల్వే అధికారులు ప్రభుత్వ తాజా ఉత్తర్వులను అనుసరించి, స్టేషన్ పేరును మార్చడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా ఈ పేరు మార్పు ప్రక్రియను పూర్తిచేశారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ను 1900లో హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలంలో నిర్మించారు. ఛత్రపతి శంభాజీనగర్ పర్యాటక కేంద్రంగా పేరొందుతోంది. ఈ ప్రాంతంలోనే అజంతా గుహలు, ఎల్లోరా గుహలతో పాటు పలు చారిత్రక కట్టడాలున్నాయి.
ఇది కూడా చదవండి: Mann Ki Baat: స్వదేశీ వస్తువులనే కొనండి: ప్రధాని మోదీ


