
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. రూ.24,634 కోట్ల విలువైన నాలుగు మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లోని 18 జిల్లాలను అనుసంధానం చేసే ఈ నాలుగు ప్రాజెక్టులు ప్రస్తుత భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను సుమారు 894 కి.మీ. మేరకు విస్తరించనున్నాయి.
నాలుగు ప్రాజెక్టులు ఇవే..
వార్ధా - భూసావల్ - 3వ, 4వ లైన్ - 314 కి.మీ (మహారాష్ట్ర)
గోండియా - డోంగర్‌గఢ్ - 4వ లైన్ - 84 కి.మీ (మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్)
వడోదర - రత్లం - 3వ, 4వ లైన్ - 259 కి.మీ (గుజరాత్, మధ్యప్రదేశ్)
ఇటార్సి - భోపాల్ - బినా 4వ లైన్ - 237 కి.మీ. (మధ్యప్రదేశ్)
కేబినెట్ ఆమోదం పొందిన ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్ట్ సుమారు 3,633 గ్రామాలకు కనెక్టివిటీని పెంచుతుంది. ఇది దాదాపు 85.84 లక్షల జనాభాకు ప్రయోజనం కలిగించనుంది. పెరిగిన ఈ రైల్వే లైన్ సామర్థ్యం భారతీయ రైల్వేలకు మెరుగైన కార్యాచరణను అందిస్తుంది. ఈ ప్రాజెక్టులు ప్రయాణికులు, వస్తు సేవలకు సమర్థవంతమైన కనెక్టివిటీని అందించనున్నాయి.
ఈ నూతన ప్రాజెక్టు సాంచి, సాత్పురా టైగర్ రిజర్వ్, భీంబెట్కాలోని రాక్ షెల్టర్, హజారా జలపాతం, నవేగావ్ నేషనల్ పార్క్ మొదలైన ప్రముఖ గమ్యస్థానాలకు రైలు కనెక్టివిటీని అందిస్తుంది. ఇది పర్యాటకులకు అనువైన రవాణా మార్గాన్ని అందించనుంది. బొగ్గు, కంటైనర్లు, సిమెంట్, ఫ్లై యాష్, ఆహార ధాన్యాలు, ఉక్కు మొదలైన వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టు ఉపకరించనుంది. రైల్వే లైన్ సామర్థ్యం పెంపుదల కారణంగా ఫలితంగా 78 ఎంటీపీఏ(సంవత్సరానికి మిలియన్ టన్నులు) పరిమాణంలో అదనపు సరుకు రవాణా జరగనుంది.