న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మరోమారు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈరోజు ‘మన్ కీ బాత్’ 127వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో తొలుత ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఛత్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవ ప్రాముఖ్యతను వివరించారు. అవకాశం దొరికినవారంతా ఛత్ పండుగలో పాల్గొనాలని కోరారు. ఈ పండుగ భారతదేశంలోని ఐక్యతకు చిహ్నమన్నారు. పండుగ సమయంలో దేశ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఛత్ ఉత్సవం సంస్కృతి, ప్రకృతి, సమాజం మధ్య ఉన్న లోతైన ఐక్యతను తెలియజేస్తుందని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలోని ప్రతి వర్గాన్ని ఏకం చేస్తుందని, ఇది భారతదేశ సామాజిక ఐక్యతకు అందమైన ఉదాహరణ అని ప్రధాని అభివర్ణించారు. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు సాధించిన విజయానికి ప్రధానమంత్రి మోదీ తన ప్రసంగంలో ప్రశంసలు కురిపించారు. భారతదేశం సాధించిన విజయం దేశ ప్రజల్లో సంతోషాన్ని నింపిందన్నారు. ఇదేవిధంగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో ప్రభుత్వం సాధించిన విజయాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
దేశ ప్రజలంతా మొక్కలు నాటాలని కోరుతూ చెట్లు, మొక్కలు ఏ ప్రదేశంలో ఉన్నా, అవి ప్రతి జీవి శ్రేయస్సుకు ఉపయోగపడతాయన్నారు. మన గ్రంథాలలో ఇదే విషయాన్ని వివరించారన్నారు. అక్టోబర్ 31న జరగనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి పటేల్ ఆధునిక కాలంలో దేశంలోని ప్రముఖులలో ఒకరని మోదీ పేర్కొన్నారు. సర్దార్ పటేల్ పరిశుభ్రత, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చారని, భారతదేశాన్ని ఏకం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని ప్రధాని అన్నారు.
అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా పరుగు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ప్రధాని కోరారు. బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచిన భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ 2025, నవంబర్ 7న భారతదేశం ‘వందేమాతరం’ 150వ వేడుకల్లోకి అడుగుపెడుతుందని అన్నారు. ఈ పాటను రచించిన బంకిం చంద్ర ఛటర్జీని ఆయన ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: ‘20 నెలల్లో నం. వన్’: తేజస్వి యాదవ్


