పట్నా: నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)ప్రతిపక్ష మహాఘట్ బంధన్.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. తాజాగా పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్‌ను నంబర్ వన్ చేస్తామని పేర్కొన్నారు.
మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘మా ప్రచారం ప్రారంభమైంది. బీహార్ మార్పు కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. మేము ఎక్కడికి వెళ్లినా, అన్ని కులాలు, మతాల ప్రజలు మాకు మద్దతు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. దానిని మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. బీహార్ ప్రజల నుండి మేము 20 నెలలు కోరుకుంటున్నాం. ఈ కాలంలో బీహార్‌ను నంబర్ వన్‌గా మార్చడానికి మేము కృషి చేస్తాం’ అని అన్నారు.
ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ పలు ప్రధాన ప్రకటనలు కూడా చేశారు. మూడు అంచెలుగా పంచాయతీ ప్రతినిధులు, గ్రామ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చారు. వారికి పెన్షన్లు అందించాలని కూడా నిర్ణయించామన్నారు. వారికి రూ. 50 లక్షల బీమా అందజేయనున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారుల గౌరవ వేతనాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తామని, క్వింటాలుకు మార్జిన్ మనీ పెంచుతామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉన్నవారికి కారుణ్య ఉపాధికి వర్తించే వయోపరిమితి కూడా పెంచుతామన్నారు. కుమ్మరి, కమ్మరి వడ్రంగి తదితర స్వయం ఉపాధి పనుల కోసం ఐదేళ్ల వ్యవధితో వడ్డీ లేని విధంగా రూ. 5 లక్షల రుణం అందిస్తామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి..


